calender_icon.png 15 January, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనతో ముప్పు రావచ్చు

03-09-2024 01:23:14 AM

గణనకు ఓకే కానీ.. రాజకీయాలకు వాడొద్దు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయం 

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకం

కాంగ్రెస్ విమర్శ.. కులగణన సాధిస్తామని శపథం 

పాలక్కడ్, సెప్టెంబర్ 2: దేశంలో కులగణన చాలా సున్నితాంశమని ఆర్‌ఎస్‌ఎస్ అభిప్రాయపడింది. కులగణనతో  సంక్షే మ పథకాల సమర్ధంగా అమలు చేయవచ్చు కానీ.. ఆ డాటాను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొంటే ప్రమాదమని ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య అధికార ప్రతి నిధి సునీల్ అంబేకర్ తెలిపారు. కేరళలోని పాలక్కడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహిస్తున్న మూడు రోజుల కాంక్లేవ్‌లో ఆయన మా ట్లాడారు.

‘కులగణన చాలా సున్నితాంశం. ఇది దేశ ఐక్యత, సమగ్రతకు చాలా ముఖ్యం. దీనిని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. కొన్నిసార్లు ప్రభుత్వానికి ఆ లెక్కలు అవసరమే. కానీ ఆ సమాచారం ఆయా వర్గాల ప్రజల సంక్షేమానికి మాత్రమే ఉపయోగపడాలి. రాజకీయ వస్తువుగా ఉపయోగించు కోరాదు’ అని పేర్కొన్నారు. 

పట్టువీడని ఇండియా కూటమి

దేశంలో కుల గణన నిర్వహించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నది. దీనిని బీజేపీ వ్యతిరేకిస్తున్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి ఈ అంశాన్నే తమ ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకొన్నది. ముఖ్యంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ దేశం లో ఎక్కడికి వెళ్లినా, ఏ సమావేశంలో పాల్గొ న్నా కుల గణనపై కచ్చితంగా ప్రకటన చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కుల గణన చేపట్టాల్సిందే.. ఆ డాటా ఆధారంగా ఎవరి సామాజికవర్గం ఎంత ఉందో చూసి వారి సంక్షేమానికి ఆ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సిందేనని ఆయన బలంగా పట్టుబడుతున్నారు. దీంతో బీజేపీ నేతలు రాహుల్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు.

ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఏకంగా రాహుల్‌పై దూషణలకు దిగారు. ‘తన కులం ఏమిటో తెలియని వ్యక్తి కుల గణనకు డిమాండ్ చేయటం ఏంటి?’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతున్నా.. ఇప్పటివరకు ఈ అంశంపై ఆర్‌ఎస్‌ఎస్ స్పందించలేదు. మొదటిసారి నోరు విప్పిన ఆ సంఘం నేత అటు అనుకూలంగా కాకుండా.. ఇటు వ్యతిరేకంగా కాకుండా నర్మగర్భ వ్యాఖ్యలు చేయ టంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో బీజేపీ ఓటు బ్యాంకు మొత్తం బీసీలే.

కుల గణన నిర్వహిస్తే ఓబీసీలు కచ్చితంగా తమ జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ పథకాలు, నిధులు, రాజకీయ పదవులు డిమాండ్ చేసే ప్రమాదముందని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భయపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటనపై కాంగ్రె స్ మండిపడింది. ‘కుల గణనను ఆర్‌ఎస్‌ఎస్ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నది.

కుల గణన సమాజానికి మంచిది కాదని ఆ సంఘం చెప్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కుల గణనకు సిద్ధంగా లేవని ఈ ప్రకటనతో తేలిపోయింది. దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు వారి హక్కులు వారికి ఇచ్చేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధంగా లేవు. కానీ రాసిపెట్టుకోండి.. దేశంలో కుల గణన జరుగుతుంది. కాంగ్రెస్ దానిని సాధిస్తుంది’ అని ఆ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ మెసేజ్ పోస్ట్ చేసింది.