30-04-2025 12:00:00 AM
జడ్పీ సీఈఓకు వావిళ్ల రమేష్ గౌడ్ ఫిర్యా దు
పెన్ పహాడ్, ఏప్రిల్ 29 : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కమిటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, సంపన్న కుటుంబాలను అర్హులుగా గుర్తించి ఎంపీడీఓకు జాబితా పంపుతున్నట్లు ఆజాబితానే తుది జాబితాగా గుర్తిస్తున్నట్లు వెంటనే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాను పునః పరిశీలన చేసి అక్రమ వసూలు.. అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ జిల్లా పరిషత్ సీఈఓ వీవీ అప్పారావుకు మంగళవారం పీఏసీఎస్ వైస్ చైర్మన్ వావిళ్ల రమేష్ గౌడ్ మండల యువతతో కలసి వినతి పత్రం అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు సైతం పాలక వర్గాలకు అనుకూలంగా మారి వారు పంపిన పేర్లను జాబితాలో పొందపర్చడంతో నిజమైన అర్హులకు ఇందిరమ్మ గూడు దూరమవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు కాకుండా భూస్వాములకు, సంపన్న వర్గాలకు కట్టబెడుతున్నారని అన్నారు. ఇందిరమ్మ కమిటీలకు అధికారులు వత్తాసు పలకడం హేయమైన చర్యన్నారు.
అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై రిసర్వే చేసి సంపన్నలను, అనర్హులను జాబితానుంచి తొలగించి నిజమైన అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు అందేలా, చూడాలని కోరారు. లేని ఎడల గ్రామాలలో పేదలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి హక్కులు సాధించేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. వారి వెంట గంగారపు శ్రీనివాస్, భూక్యా అశోక్, చంటి నాయక్, భూక్యా వెంకటేశ్వర్లు ఉన్నారు.