calender_icon.png 18 April, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రవీణ్ పగడాల మృతిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి

27-03-2025 07:39:02 PM

కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్..

సంగారెడ్డి (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రవీణ్ పగడాల మృతి అనుమానాస్పదంగా ఉందని, తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డిలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక సంఘం జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రవీణ్ మరణం అనేక అనుమానాలకు దారి తీస్తుందని, తమ కుటుంబ సభ్యులు క్రైస్తవ పాస్టర్లు పేర్కొంటున్న విధంగా ఇది ఆత్మహత్య కాదు హత్యేనని చెప్పిన దానిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలన్నారు. క్రైస్తవులపై దాడులు అరికట్టాలని అన్నారు. 

మతం వ్యక్తిగత విశ్వాసం లాగా ఆయన భావించి క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాడని, వివిధ టీవీ డిబేట్ లలో తన మతంలోని మంచి అంశాలను చెబుతూనే  సమాజంలో జరుగుతున్న అనేక రకాల అవమానాలను ఎండగట్టారని చెప్పారు. దళితులపై దాడులు జరిగినప్పుడు పలుమార్లు చర్చించే వాడని గుర్తుచేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉన్మాదులు ఏ మతంలో ఉన్న దేశానికి ప్రమాదమేనని అన్నారు. తన ప్రసంగాల కింద అనేక రూపాలలో ఆయనను చంపుతామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారని అలాంటివారిని విచారించాలన్నారు. ఒక మనిషిని మరొక మనిషి చంపుకోవడం అవమానించడం కించపరచడం అనేది ఏ మతం చెబుతది అన్నారు. ప్రవీణ్ పగడాల మృతి పట్ల కేవిపిఎస్ ప్రగాఢ సంతాపం ప్రకటిస్తుందని ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పి అశోక్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరు శివకుమార్, కె. సుభాష్, జిల్లా సహాయ కార్యదర్శులు బి ప్రవీణ్, ఎహ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.