calender_icon.png 23 December, 2024 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిక్కుముడుల పరీక్ష

20-10-2024 12:00:00 AM

తెలంగాణలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్-1 పరీక్ష అనుకున్న విధంగా జరుగుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నెల 21నుంచి గ్రూప్-1 పరీక్షలు నిర్వహిం చడానికి రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ పరీక్షల నోటిఫికేషన్ జారీని రద్దు చేయాలని, ‘కీ’లో తప్పులున్నందున పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కొంతమంది అభ్యర్థు లు దాఖలు చేసిన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టి వేసింది. మొదట సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును పిటిషనర్లు డివిజన్ బెంచ్‌లో సవాలు చేయగా, ఆ పిటిషన్లను కూడా బెంచ్ కొట్టివేసింది.

దీంతో పరీక్షల నిర్వహణకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయనే అందరూ భావించారు. విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు సైతం చేసింది. 2022 నాటి గ్రూప్1నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ఫిబ్రవరిలో ప్రభుత్వం వెబ్‌నోట్ పెట్టినప్పుడు కోర్టును ఆశ్రయించకుండా ఆరునెలలకు అదీ ప్రిలిమినరీ పరీక్షలు రాశాక ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించింది. ‘ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రద్దయ్యాయి. ఎన్నేళ్లు ఇలా వివాదాలు కొనసాగించాలి. వీటిని అనుమతిస్తే కొత్త అభ్యంతరాలతో మరికొందరు కోర్టును ఆశ్రయిస్తారు. ఇప్పటికే అభ్యర్థుల్లో నైరాశ్యం పెరిగిపోతోంది.  ఇప్పుడు మళ్లీ వాయిదా అంటే కుదరదు’ అని ధర్మాసనం కరాఖండీగా స్పష్టం చేసింది.

అంతకు ముందు అభ్యర్థుల తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తూ హైకోర్టు తీర్పు ప్రకారం గత నోటిఫికేషన్ ఆధారంగా పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా తాజాగా జీవో 29ని జారీ చేయడం సరికాదన్నారు. కొత్తగా ఏర్పడిన అదనపు ఖాళీలకు వేరే నోటిఫికేషన్‌ను జారీ చేసి ఉండాల్సిందని వాదించారు. అయితే అభ్యర్థులు లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత రెండు ప్రశ్నలను తొలగించి తుది ‘కీ’ని విడుద ల చేశామని ప్రభుత్వం, కమిషన్ తరఫు న్యాయవాదులు వాదించారు. కాగా హైకోర్టు తీర్పు పై అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు సోమవారం అంటే గ్రూప్1 మొదలయ్యే రోజున విచారణకు రానున్నాయి.

ఈ లోగా ఈ వివాదం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు అండగా నిలవడంతో ఇది ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి మద్దతు ప్రకటించగా, మరోవైపు బీజేపీ కూడా  రంగంలోకి దిగింది. శనివారం కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో సెక్రటేరియట్’ యాత్రలోకి బీఆర్‌ఎస్ నేతలు కూడా వచ్చి చేరడంతో తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. దీంతో రెండు పార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేసి, మిగతా వారిని చెదరగట్టారు.

ఈ గొడవ అంతా ముగిశాక పోలీసు అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ పరీక్షలను రద్దు చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని మరోసారి స్పష్టం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిబంధనలు మారిస్తే కోర్టులు కొట్టివేస్తాయన్నారు. పాత జీవో 55 ప్రకారం పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నష్టం జరిగేదన్నారు. పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, ఆందోళను విరమించి పరీక్షలకు సిద్ధం కావలసిందిగా విజ్ఞప్తి చేశారు.

సీఎం చెప్తున్నట్లుగా తరచూ పరీక్షలను వాయిదా వేస్తూ పోతే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందనేది వాస్తవం.నిధులు, నియామకాలు, నీళ్ల కోసమే కొట్లాడి తెలంగా ణను తెచ్చుకున్నా పదేళ్లుగా నియామకాల విషయంలో అన్యాయమే జరిగిందనే ఆవేదన యువతలో ఉంది. అలాగే జీవో 29ను రద్దు చేయాలన్న డిమాండ్‌లో కూడా న్యాయం ఉంది.  ఈ అన్ని విషయాలను పరిశీలించి ఓ పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానాలు ఆ పని చేస్తాయా? లేక రాష్ట్రప్రభుత్వమే చొరవ తీసుకుంటుందా? అనేదే ఇప్పుడు ప్రశ్న.