calender_icon.png 20 April, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవ్యవస్థకు పరీక్ష

25-03-2025 12:00:00 AM

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికార నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్త లు ఇప్పుడు దేశ న్యాయవ్యవస్థనే కుదిపేస్తున్నాయి. హోలీ పండగ రోజున వర్మ అధికార నివాసంలో అగ్నిప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చినట్లు వార్తలు రావడంతో సుప్రీంకోర్టు సైతం దీన్ని తీవ్రమైన అం శంగా పరిగణించింది.

దీనిపై అత్యవసరంగా సమావేశమైన కొలీజియం వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని తొలుత నిర్ణయించింది. అయితే దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈలోగా వర్మను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ సోమవారం నిర్ణయం తీసుకొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే దాకా ఇది అమలులో ఉంటుందని తెలి పింది.

ఈ లోగా ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. దీనిపై కేంద్రం ఆమోదం లభించాక తుది ప్రకటన వెలువడనుంది. మరోవైపు ఈ అంశంపై అంతర్గత విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలో హర్యానా, పంజాబ్ హైకోర్టు, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజేలతోపాటు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి సభ్యులు గా ఉన్నారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను వర్మ ఖండించారు. తాను కానీ, తన బంధువులు కానీ ఎటువంటి నోట్ల కట్టలను అగ్నిప్రమా దం జరిగిన గదిలో ఉంచలేదని ఢిల్లీ హైకోర్టు సీజేకి ఇచ్చిన సమాధానం లో ఆయన స్పష్టం చేశారు. తమ నగదు విత్‌డ్రాలన్నీ కూడా బ్యాంకులద్వారానే జరుగుతాయని, యూపీఐ యాప్‌లు, కార్డులతో లావాదేవీలు జరుపుతామని ఆయన తెలిపారు. అంతేకాకుండా తాము ఆ గదిని స్టోర్‌రూమ్‌గా మాత్రమే వాడతామని కూడా వర్మ స్పష్టం చేశారు.

అయితే ఈ వాదనలు ఎలా ఉన్నప్పటికీ జస్టిస్ వర్మ నివాసంలో నాలుగైదు సంచుల లో పాక్షికంగా కాలిన నోట్లు లభ్యమయినట్లు ఢిల్లీ సీజే దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సుప్రీంకోర్టు సీజేఐకు నివేదిక పంపించారు. న్యాయవ్యవస్థపై పడిన మచ్చను తుడిచివేయడానికి దీనిపై లోతుగా అంతర్గత విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలని సుప్రీంకోర్టు సీజేఐ సంజయ్ ఖన్నా నిర్ణయించారు.

లేనిపక్షంలో ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ చులకనైపోతుందని ఆయన భావిస్తు న్నారు. అయితే ఈ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం సరికాదనే అభిప్రాయాలు న్యాయవర్గాలో వ్యక్తమవుతున్నాయి. వర్మ నిజాయితీ పట్ల కూడా కొందరు కితాబు ఇస్తున్నారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, దాని దర్యాప్తులో ఏం తేలుతుందో చూసిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందని  చెప్పారు. 

అయితే దేశంలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై1600కు పైగా ఫిర్యాదులు ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి 2022లో  పార్లమెంటులోనే చెప్పారు. అయితే ఈ ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యా తీసుకున్న దాఖలాలు లేవు. అంతేకాదు, గతంలో అవినీతి ఆరోపణలపై కొందరు జడ్జీలపై పార్లమెంటులో అభిశంసన చర్యలకు కూడా ఉపక్రమించారు కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు.

మరి ఇప్పుడు అందుకు భిన్నంగా ఏమయినా జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జడ్జీల ఎంపికలో పారదర్శకత కరువైన కారణంగా ఇలాంటి అవినీతి ఆరోపణలు తరచూ వస్తున్నాయని సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆలోచించేలా చేస్తున్నాయి.

ఏది ఏమయినా జస్టిస్ వర్మ వ్యవహారం మరోసారి దేశంలోని న్యాయవ్యవస్థలో లోపాలు, అవినీతిపై చర్చకు తెరతీసిందనడంలో సందే హం లేదు.  ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు జరిపే దర్యాప్తు వ్యవస్థ ప్రక్షాళనకు దారితీయాలని అందరూ కోరుకుంటున్నారు.