- నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటీల రాజేందర్
అభిమాన నేతను కడసారి చూపునకు తరలివచ్చిన జనం
అంతిమయాత్రలో ఉమ్మడి జిల్లా ప్రతినిధులు
రమేశ్ వ్యవసాయ క్షేత్రంలో దహన సంస్కారాలు
ఆదిలాబాద్, జూన్ 30(విజయక్రాంతి): ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథో(59) అంతిమయాత్ర కుటుంబ సభ్యులు, అభిమానులు, అశేష జన అశ్రునయనాల మధ్య ఆదివారం పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో 30 ఏళ్లకు పైగా వివిధ పదవుల్లో కొనసాగిన గిరిజన నాయకుడి శకం ముగిసింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్ రాథోడ్ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నాయకులు, అభిమానులు, ప్రజల సందరనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉట్నూర్‌లోని తన సగృహంలో ఆదివారం ఉదయం వరకు ఉంచారు. బీజేపీ నాయకులు రమేశ్ రాథోడ్ భౌతికకాయంపై బీజేపీ జెండాను కప్పి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం లంబాడా సమాజ సంప్రదాయాల ప్రకారం ఉట్నూర్ ఎక్స్‌రోడ్ వద్ద గల ఆయన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు పూర్తి చేశారు. పెద్ద కుమారుడు రితీష్ రాథోడ్ చితికి నిప్పంటించడం తో దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి.
అభిమానుల నినాదాలతో హోరెత్తిన ఉట్నూర్
రమేశ్ రాథోడ్ అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. తమ అభిమాన నాయకున్ని కడసారి చూసేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు, వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. రమేశ్ రాథోడ్ ఇంటి నుండి ఉట్నూర్ ఎక్స్‌రోడ్డు వద్ద గల వ్యవసాయ క్షేత్రం వరకు నాలుగు కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో భౌతిక కాయాన్ని ఉంచి అంతిమయాత్ర కొనసాగించారు. గిరిజన టైగర్ రమేశ్ రాథోడ్ అమర్ రహే అంటూ అభిమానులు చేసిన నినాదాలు హోరెత్తాయి.
అంతిమయాత్రలో ప్రముఖులు
రమేశ్ రాథోడ్ అంతిమయాత్రలో మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. రమేశ్ అకాల మరణం బీజేపీకి తీరని లోటు అని అన్నారు. అలాగే మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి, మాజీ మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, అమర్ సింగ్ తిలావత్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్, అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, రామారావు పటేల్, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే కోనప్ప, బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదరి ప్రేమేందర్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే, సాజిద్ ఖాన్, జెడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
అర్ధరాత్రి వెళ్లి నివాళులర్పించిన బండి సంజయ్
కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం అర్ధరాత్రి దాటాక ఉట్నూర్‌కు ఎమ్మెల్యే పాయల్ శంకర్, హరీష్ బాబులతో కలిసి వెళ్లారు. రమేశ్ రాథోడ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. రాథోడ్ పెద్ద కుమారుడు రితీశ్‌తో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాథోడ్‌తో తనకున్న అనుబంధాన్ని బండి సంజయ్ గుర్తు చేసు కున్నారు. రమేశ్ రాథోడ్ మరణం బీజేపీకి తీరని లోటని పేర్కొన్నారు.