హక్కుల నేతకు అభిమానుల అంతిమవీడ్కోలు
సాయిబాబా భౌతిక కాయాన్ని సందర్శించిన నేతలు
మేధావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారుల నివాళి
సాయిబాబా సహ నిందితుడు హేమ్ మిశ్రా హాజరు
సారు అంతిమయాత్రకు తరలిన ఢిల్లీ వర్శిటీ విద్యార్థులు
ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు సాయిబాబా కళ్లు దానం
పార్థివ దేహం గాంధీ దవాఖానకు అప్పగించిన కుటుంబ సభ్యులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అంతిమయాత్ర సోమవారం ముగిసింది. ‘ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అమర్ రహే.. జోహార్ అమరవీరులకు.. జీనా హైతో మర్నా సీకో.. కదం కదం ఫర్ లడ్నా సీకో, జీఎన్ సాయిబాబా ఆశయాలను కొనసాగిస్తాం’ అంటూ ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలు, ప్రజాస్వామిక వాదులు గొంతెత్తి నినదించారు.
సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మౌలాలిలోని తన సోదరుడు డాక్టర్ రాందేవ్ నివాసం నుంచి బయలు దేరి సాయంత్రం 4.30 గంటలకు గాంధీ ఆసుపత్రికి చేరుకుని ఆయన మృతదేహాన్ని గాంధీ దవాఖానకు కుటుంబసభ్యులు అప్పగించారు. నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ శనివారం రాత్రి 8.45 గంటలకు కన్నుమూయగా, అదే రోజు రాత్రి ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు దానం చేశారు.
సోమవారం ఉదయం 8 గంటలకు నిమ్స్ వైద్యులు సాయిబాబా భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు, హక్కుల సంఘాల నేతలకు అప్పగించారు. అనంతరం ఉదయం 9.15 గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపం గన్‌పార్కు వద్దకు చేరుకుని అక్కడ కొద్దిసేపు సాయిబాబా భౌతికకాయాన్ని ఉంచి.. అక్కడి నుంచి 10.30 గంటలకు మౌలాలిలోని సాయిబాబా సోదరుడు డాక్టర్ రాందేవ్ నివాసానికి తరలించారు.
వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు, హక్కుల సంఘాల నేతలు, ప్రజాస్వామిక వాదులు సాయిబాబాకు నివాళులర్పించేందుకు విరసం ఆధ్వర్యంలో సంతాప సమావేశం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ర్యాలీగా బయలుదేరి సాయంత్రం గం.4.30లకు సాయిబాబా భౌతికకాయాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగించారు.
సాయిబాబాకు పలువురి నివాళి
వివిధ రాజకీయ పార్టీల నేతలు, కమ్యూనిస్టు, విప్లవ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల, పౌర హక్కుల ఉద్యమ నాయకులు, మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా భౌతిక కాయాన్ని సందర్శించి, ఘనంగా నివాళులర్పించారు.
విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ, నిర్బంధ వ్యతిరేక వేదిక కో రవిచంద్ర, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు పద్మకుమారి ఆధ్వర్యంలో మౌలాలిలోని డాక్టర్ రాందేవ్ నివాసం వద్ద సంతాప సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు నాగాలాండ్ జైలులో ఖైదీగా ఉన్న హేమ్‌మిశ్రా, భీమా కోరెగావ్ కేసులో నిందితుడు హనీబాబు సతీమణి జెన్నీ రోవేనా, ఢిల్లీ హైకోర్టు న్యాయవాది ఎత్‌మామ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేవీప్రసాద్, దేశపతి శ్రీనివాస్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేశ్, సీనియర్ నాయకులు బోస్, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు మురళీధర్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, డీజీ నరసింహరావు, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, వేములపల్లి వెంకట్రామయ్య, గోవర్థన్, జేవీ చలపతిరావు, సరళ, జనశక్తి నాయకులు అమర్, అరుణోదయ విమలక్క, మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేజీ రాంచందర్ రావు, ఎస్. రమ, హన్మేష్, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, ప్రొ. హరగోపాల్, ప్రొ.బి.నరసిం హరెడ్డి, ప్రొ.కాసీం, ప్రొ.రమా మెల్కోటే, ప్రొ. సూరేపల్లి సుజాత, భూమిక సత్యవతి, వసంత కన్నాభిరామన్, వీక్షణం వేణుగోపాల్, మానవ హక్కు ల వేదిక ఉమ్మడి రాష్ట్ర పరిశీలకులు జీవన్‌కుమార్, పౌరహక్కుల సంఘం తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డంలక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, ఏపీ సీఎల్‌సీ అధ్యక్షుడు చంద్రశేఖర్, సీనియర్ సంపాదకులు కే రామచంద్రామూర్తి, కే శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య, గాదె ఇన్నయ్య, ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ, ప్రముఖ కవి సంగిశెట్టి శ్రీనివాస్, లెల్లే సురేశ్, న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, రఘునాథ్, సామాజిక కార్యకర్తలు మీరా, సజయ తదితరులు పాల్గొని సాయిబాబా కు నివాళులర్పించారు.
కేటీఆర్ రాకతో గో బ్యాక్ నినాదాలు
సాయిబాబా భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాగా.. పలువురు ప్రజా సంఘాల కార్యకర్తలు గో బ్యాక్ నినాదాలు చేశారు. కేటీఆర్ వచ్చీ రాగానే సాయిబాబా భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కొద్ది సేపటిలోనే ఓ కార్యకర్త కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు ఇవ్వడంతో అక్కడున్న ప్రజా సంఘాలకు చెందిన మిగతా వారు సైతం కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సాయిబాబా సంతాప సమావేశంలో కేటీఆర్ మాట్లాడకుండానే వెనుతిరగాల్సి వచ్చింది.
గన్‌పార్క్ వద్ద అడ్డగించిన పోలీసులు
ఉదయం 8 గంటల ప్రాంతంలో నిమ్స్ ఆసుపత్రి నుంచి సాయిబాబా మృతదేహంతో బయలుదేరిన హక్కుల సంఘాల నేతలు 9.15 గంటలకు గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ సాయిబాబా మృతదేహాన్ని కొద్దిసేపు ఉంచి సంతాప సమావేశాన్ని నిర్వహించాలని భావించగా, అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హక్కుల సంఘాల నేతలకు, పోలీసులకు మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, సాయిబాబా భౌతికకాయానికి అంబులెన్స్‌లోనే పలువురు నేతలు నివాళులర్పించారు.
20న సాయిబాబా సంస్మరణ సభ
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సంస్మరణ సభ ఈ నెల 20న నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు, హక్కుల సంఘాల నాయకులు తెలిపారు. సాయిబాబాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా ఉద్యమాలతో సంబంధాలు ఉన్నందున, వివిధ ఉద్యమాలతో ఆయనకున్న అనుబంధం, వివిధ ప్రజా సంఘాల అనుభవాలను పంచుకునేలా అన్ని ప్రజాస్వామ్య హక్కుల, ప్రజా సంఘాలతో ఈ సంస్మరణ సభ జరగనున్నట్టు తెలిపారు. ఈ సంస్మరణ సభ ప్రదేశం ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు.
అభిప్రాయాలు
సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాస్తా
ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను పదేళ్లపాటు అన్యాయంగా జైళ్లో నిర్భంధించారు. ఆ తర్వాత ఆయనను నిర్దోషిగా విడుదల చేశారు. జైలులో ఉండగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినడం కారణంగానే మరణించారు. జైలులో ఆయనకు సరైన వైద్య సదుపాయాలు కల్పించలేదు. ఇప్పడు ఆయన మరణానికి దోషి ఎవరో తేల్చాలి. ఈ విషయంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాస్తాను.
డాక్టర్ కే నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి
కేంద్ర ప్రభుత్వం సాయిబాబా పట్ల పాశవికంగా వ్యవహరించింది. పదేళ్లపాటు నిర్బంధించింది. ఆయన తల్లి మరణించినా చూడడానికి అనుమతించలేదు. రాజ్యాంగ మౌలిక సూత్రాల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సాయిబాబా. ప్రజాస్వామిక వాదులందరూ సాయిబాబా పట్ల కేంద్రం వ్యవహారించిన నిర్భంధాన్ని ఖండించాలి. సాయిబాబా మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు
సమాజ మార్పు కోసం పోరాడిన గొప్ప వ్యక్తి
పది మంది దోషులు తప్పించుకున్నా సరే, ఒక నిర్దోషికి శిక్ష పడొద్దని మన న్యాయ సూత్రం చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం కొనసాగించిన అణిచివేత ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నా. 90 శాతం వైకల్యం ఉన్న వ్యక్తిపై అక్రమ కేసులు బనాయించడం బాధాకరం.
సుప్రీంకోర్టును ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. కానీ, జైలులో దశాబ్ద కాలం అనుభవించిన క్షోభకు ఎవరు సమాధానం చెప్తారు. జైలు నుంచి విడుదలై స్వేచ్ఛ వాయువులు పీల్చకముందే సాయిబాబా మృతిచెందడం బాధాకరం. ఆయన కళ్లను, శరీరాన్ని దానం చేయడం ఆదర్శనీయం.
తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే
సాయిబాబా లాంటి శక్తులను అంతం చేయలేరు
సాయిబాబాపై తప్పుడు ఆరోపణలతో జైలులో బంధించారు. 10 ఏళ్లపాటు నిర్బంధించి వైద్య సౌకర్యాలు కూడా లేకుండా చిత్రవధ చేశారు. ఆయన శరీరంలోని అవయవాలన్నీ దెబ్బ తినడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే. ప్రశ్నించే వాళ్లను హెచ్చరించడం కోసం సాయిబాబాను ఉదాహరణగా చూపాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
ఒక వ్యక్తిని అంతం చేయోచ్చేమో కానీ సాయిబాబా లాంటి వాళ్లు వ్యక్తులు కాదు శక్తులు అని గుర్తుంచుకోవాలి. సమాజ మార్పు కోసం, ప్రజాస్వామ్య, పౌరహక్కుల, అభ్యదయ కరమైన ఉద్యమాలను ప్రభుత్వాలు అణిచివేతతో అడ్డుకోలేవు.
ఎస్ వీరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
సాయిబాబా చరిత్రలో నిలిచిపోతారు
ప్రొఫెసర్ సాయిబాబా తనతో తాను పోరాటం చేస్తూనే వ్యవస్థపై చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. పదేళ్లు అండా సెల్‌లో ఏ సహాయం లేకుండా ఉన్నారు. ఆయన ఆరోగ్యం అంతా జైలులోనే పాడైపోయింది. మానవ హక్కుల ఉద్యమానికి తీరని లోటు.
వికలాంగుడైనా జీవితాంతం మానవ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన అద్భుతమైన వ్యక్తి. అమానవీయంగా మారుతున్న ఈనాటి వ్యవస్థే ఆయన మరణానికి కారణం. ఒకవైపు రాజ్యం, పోలీసు యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, జైళ్లు ఇలా భిన్నమైన వ్యవస్థలు కూడా ఆయన పట్ల మానవీయంగా ప్రవర్తించ లేకపోయాయి.
ప్రొఫెసర్ హరగోపాల్ , నిర్భంద వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్
కలవనీ.. చూడని వాళ్లతో సంబంధాలా?
సాయిబాబా పోరాటాలకు కీలకం. పోరాటాలు ఎలా చేయాలో ఒక లక్ష్య ప్రకటనను తయారు చేసి వరంగల్‌లో ప్రకటించారు. ఆయన అందర్నీ కలిశాడు. కానీ, మావోయిస్టులను మాత్రం కలవలేదు. మావోయిస్టులు కూడా ఆయనను కలవలేదు. కలవనీ, చూడనీ వాళ్లతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించి ఉపా కింద అరెస్టు చేశారు. కదలలేని ఆయన బుర్రలో ఉన్న మెదడును గడ్చిరోలి న్యాయమూర్తి తప్పుబట్టిండు. న్యాయ వ్యవస్థ, రాజకీయాలు అన్నీ కలిసి సాయిబాబాను హత్య చేశాయి. సాయిబాబా భౌతికంగా లేకపోవచ్చు. ఆయన అందించిన ఆశయాలు మా ముందు ఉన్నాయి.
ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, సివిల్ లిబర్టీస్ కమిటీ అధ్యక్షుడు
జైలులో వైద్యం అందించలేదు
జైలులో ఆయనకు మంచినీళ్లు కూడా సక్రమంగా అందించలేదు. అండా సెల్‌లో కనీస సౌకర్యాలు లేకుండా చేశారు. ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ వైద్య సౌకర్యాలు కల్పించలేదు. జైలులోనే దాదాపు 29 రకాల వ్యాధులతో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. పదేళ్ల పాటు ఆరోగం క్షీణించేలా చేసి ఇప్పుడు బతకాలంటే ఎలా బతుకుతాడు. సాయిబాబా మరణానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి.
హేమ్ మిశ్రా, సహ నిందితుడు, ఢిల్లీ
సాయిబాబా ఆలోచనలు బతికే ఉన్నాయి
ప్రొఫెసర్ సాయిబాబా ప్రజాఉద్యమాలకు పెద్ద దిక్కులా పనిచేశాడు. ఆయన ఏ నేరం చేయకున్నా ప్రభుత్వమే హత్య చేసింది. సాయిబాబా శరీరంతో కాకుండా ఆలోచనలతో పనిచేశాడు. ఆయన ఆలోచనలు నిత్యం మన వెంటే ఉంటాయి. ఇది కచ్చితంగా రాజ్యం చేసిన హత్యే.
అమర్, జనశక్తి నేత