సైదాబాద్ దోభీఘాట్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
రంగారెడ్డి/ ఎల్బీనగర్, జనవరి 13: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో సైదాబాద్‌లోని దోభీఘాట్ శ్మశానవాటికిలో సోమవారం సాయంత్రం ముగిశాయి. చంపాపేటలోని స్వగృహం నుంచి శ్మశానవాటిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దోబీఘాట్‌లో పెద్దకుమారుడు శ్రీనాథ్ చితికి నిప్పంటించారు.
మందాకు గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి వందనం సమర్పించారు. అంత్యక్రియల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, సంపత్‌కుమార్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతోపాటు ప్రజాప్రతినిధులు మంద జగన్నాథం భౌతికాయాన్ని సందర్శించి, కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణ రాష్ట్రం సీనియర్ నాయకుడ్ని కోల్పోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సాధనకు మందా జగన్నాథం చేసిన కృషి మరువలేనిదన్నారు. దళితుల ఉన్నతికి ఆయన కృషి చేశారని గుర్తు చేశారు.