calender_icon.png 27 November, 2024 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుస్సాడీ కనకరాజుకు కన్నీటి వీడ్కోలు

27-10-2024 01:31:16 AM

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): గుస్సాడీ నృత్యకళాకారుడు పద్మశ్రీ కనకరాజుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీలు అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. కనకరాజు శనివారం స్వగ్రామమైన ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయిలో రాష్ట్రప్రభుత్వం అధికారికంగా, సకల లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసింది.

పోలీసులు గాలిలో కాల్పులు జరిపి కనకరాజుకు గౌరవ వందనం చేశారు. కనకరాజుకు తుది వీడ్కోలు పలికేందుకు వేలాదిగా తరలివచ్చారు. కనకరాజు పార్థివ దేహానికి ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల సంప్రదాయ నృత్యమైన గుస్సాడీని ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత కళాకారుడు కనకరాజు అని కొనియాడారు. గుస్సాడీ నృత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు కనకరాజు అహర్నిశలు శ్రమించారని కీర్తించారు.

కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సంతాపం

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ కనకరాజు మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సంతాపం తెలిపారు. గుస్సాడీ నృత్యానికి జీవం పోసి ప్రపంచానికి పరిచయం చేసిన కనకరాజు మృతి ఆదివాసీలకు తీరని లోటు అని పేర్కొన్నారు. కనకరాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు.