- అక్కడ అమలవుతున్న పథకాలపై బీఆర్‌ఎస్ బృందం అధ్యయనం
- ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో 40 మంది బీసీ నేతలు చెన్నై పర్యటన
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): తమిళనాడు తరహాలో విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. బీసీ రిజర్వేషన్లు, వారి అభివృద్ధి, సంక్షేమం కోసం తమిళనాడులో అమలవుతున్న కార్యక్రమాల అధ్యయనం, తమిళ పార్టీల్లో బహుజన వర్గాల ప్రాతినిథ్యం వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు బీఆర్‌ఎస్ బీసీ సీనియర్ నేతల బృందం తమిళనాడులో పర్యటిస్తుంది.
గురువారం చెన్నులో ఆ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో బీఆర్‌ఎస్ బీసీ నేత బృందం సమావేశమైంది. రాష్ర్టంలో రిజర్వేషన్లు, బీసీ అభివృద్ధి పథకాలకు సంబంధించిన తీరుతెన్నులను చర్చించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి విజయకుమార్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్‌తో వివరించారు. తమిళనాడులో ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ల అంశంలో సామాజిక న్యాయ దృక్పథంతో ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు ఎలా చేపట్టారో తెలిపారు. చట్టసభలు, స్థానిక సంస్థల రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్ నేతలు వివరాలు కోరగా.. వీటిలో రిజర్వేషన్లు లేకపోయినా సామాజిక చైతన్యంతో, తమిళ అస్తిత్వంతో 90 శాతానికి పైగా స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీలు గెలిచి ప్రాతినిథ్యం వహిస్తున్నారని వివరించారు.
రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం : మధుసూదనాచారి
రాష్ర్టంలో విద్యాఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్లు సాధించాలంటే తమిళనాడు తరహా రిజర్వేషన్లు ఒక్కటే పరిష్కార మార్గమని మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడో స్పష్టం చేశారని శాసనమండలిలో బీఆర్‌ఎస్ పక్ష నాయకుడు మధుసూదనాచారి స్పష్టంచేశారు. చెన్ను బీసీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ళ పాలనలో పలు సందర్భాల్లో తమిళనాడు తరహా రిజర్వేషన్లు తమ రాష్ట్రానికి అమలు పరచాలని ప్రధాని మోదీని కోరారన్నారు.
రాజ్యసభలో బీఆర్‌ఎస్ పక్ష నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్న మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీలకు విద్యాఉద్యోగాల్లోనే కాకుండా స్థానిక సంస్థల్లో ౪౨ శాతం రిజర్వేషన్లు అమలు జరిపేదాకా బీఆర్‌ఎస్ పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎంపీ లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.