భద్రాచలం (విజయక్రాంతి): పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో డిసెంబర్ 31 నుండి జనవరి 29 వరకు భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 31 నుండి జనవరి 9వ తేదీ వరకు స్వామివారి దశావతార అలంకారాలు ద్వారా భక్తులకు దర్శనం ఇచ్చే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ముక్కోటి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తెప్పోత్సవం, 10వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీత లక్ష్మణ సమేత సీతారామచంద్ర స్వామి వారిని జనవరి 9వ తేదీ సాయంత్రం పవిత్ర గోదావరి నది జలాలపై హంస వాహనంపై ఆసీనులు చేసి తెప్పోత్సవం నిర్వహించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో తెప్పోత్సవం నిర్వహించడానికి దేవస్థానం అధికారులు విస్తృతి ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వామివారు హంస వాహనంపై నది విహారం చేస్తుండగా గోదావరి ఇసుక తెన్నుల మధ్య వివిధ రకాల బాణాసంచా కాల్చుతూ భక్తులను ఆనందింప చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే హంస వాహనం నిర్మాణం పూర్తి కాగా మిగతా పనులన్నీ జనవరి 8వ తేదీ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఏడాది జిల్లా అధికార యంత్రాంగం తొలిసారి రివర్ సైడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని గోదావరి నది తీరంలో ఏర్పాటు చేస్తున్నారు భద్రాద్రి రామయ్యను దర్శించుకునే భక్తులకు రివర్ సైడ్ ఫెస్టివల్ ప్రాంగణంలో గిరిజన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడమే కాకుండా వారి వంటకాలు సైతం రుచి చూపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు విజయవంతనికి జిల్లా కలెక్టర్ జితీష్ పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ దేవస్థానం ఈవో రమాదేవి, పంచాయతీ ఈవో శ్రీనివాసరావు విశేషంగా కృషి చేస్తున్నారు.