calender_icon.png 24 January, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ సుందరీకరణపై సర్వే

05-07-2024 12:52:58 AM

  • గ్రేటర్ వ్యాప్తంగా 14 మండలాల్లో 5 రెవెన్యూ బృందాలు 
  • మూసీకి 50 మీటర్ల చుట్టూ నిర్మాణాలపై వివరాల సేకరణ 
  • ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): ఒకప్పుడు హైదరాబాద్ మహానగరానికి జీవనాడిగా పేరుగాంచిన మూసీ నది సుందరీకరణ పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తాజాగా మూసీకి ఆక్రమణల నుంచి విముక్తి కల్పించడంతో పాటు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సుందరీకరణ పనులను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే డిజిటల్ సర్వే పూర్తి చేసిన రెవెన్యూ అధికారులు తాజాగా మూసీకి ఇరువైపులా ఉన్న నిర్మాణాలకు సంబంధించిన వివరాలపై సర్వే చేపడుతున్నారు.

14 మండలాలు.. 5 బృందాలు

గ్రేటర్‌లో వెస్ట్ నుంచి ఈస్ట్ వరకూ దాదాపు 55 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న మూసీ నది సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధ్దమైంది. ఈ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మూసీ అంటే దుర్వాసన, అక్రమ నిర్మాణాలు కాకుండా.. మూసీ అంటే హైదరాబాద్ నగరానికి జీవనాడి అని పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధ్దమైన కార్యచరణకు శ్రీకారం చుట్టింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్‌డీసీఎల్) ద్వారా మూసీపై ఇప్పటికే డిజిటల్ సర్వే పూర్తి చేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది.

అయితే కోడ్ ముగిసిన వెంటనే ఎంఆర్‌డీసీఎల్ అధికారులు రెవెన్యూ సర్వేపై దృష్టి సారించారు. గ్రేటర్ వ్యాప్తంగా మూడు జిల్లాల పరిధిలో 14 మండలాల వ్యాప్తంగా డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లతో పాటు ఇతర అధికారులను కలిపి మొత్తం 5 బృందాలు ఈ సర్వేను చేపడుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్ డివిజన్ (ఆర్‌డీఓ) లోని బండ్లగూడ మండలం మినహాయించి మిగితా 8 మండలాలు.. హిమాయత్ నగర్, అంబర్‌పేట, నాంపల్లి, ఆసిఫ్ నగర్, సైదాబాద్, బహదూర్‌పురా, గోల్కొండ, చార్మినార్ మండలాల్లో, రంగారెడ్డి జిల్లాలోని.. అబ్దుల్లాపూర్ మెట్, రాజేంద్రనగర్, గండిపేట మండలాల్లో, మేడ్చల్  మల్కాజిగిరి జిల్లోని.. మేడ్చల్, ఉప్పల్, మేడిపల్లి మండలాల్లో ఇప్పటికే ఈ సర్వే ప్రారంభమైంది. 

ప్రత్యేక యాప్‌లో వివరాలు నమోదు..

సుందరీకరణ పనుల్లో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం, వెండర్ జోన్‌గా తీర్చిదిద్దనున్నారు. ఈ క్రమంలో మూసీ చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని, వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపిస్తుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడ, ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, రెసిడెన్సియల్ కమర్షియల్ తదితర కేటగిరీల వారీగా అధికారులు  వివరాలను సేకరిస్తున్నారు. ఆ నిర్మాణాలో నివాసం ఉంటున్న వారి పేర్లు, ఎంతకాలం గా అక్కడ ఉంటున్నారు అనే కోణంలో వారి సామాజిక, ఆర్థిక అంశాలను సైతం అధికారులు సేకరిస్తున్నారు.

స్థానికుల నుంచి సేకరించిన ఈ వివరాలను ఈ సర్వే కోసమే ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌లో అధికారులు అక్కడికక్కడే నమోదు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే ప్రారంభమైన ఈ సర్వే పూర్తికావాలంటే మరింత సమయం పట్టే అవకా శం ఉంది. సర్వే అనంతరమే ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో రెవెన్యూ అధికారుల సర్వే చాలా కీలకంగా మారనుంది.