calender_icon.png 15 November, 2024 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టభద్రుల ఓటర్ల పరిశీలన

14-11-2024 12:00:00 AM

  1. వచ్చిన దరఖాస్తులు 3,58,579
  2. ధ్రువీకరించినవి 2,42,916
  3. 27,155 దరఖాస్తులు తిరస్కరణ
  4. డిసెంబర్ 30న తుది జాబితా

కరీంనగర్, నవంబర్ 13 (విజయక్రాంతి): కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చేపట్టిన పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ముగిసి పరిశీలన కొనసాగుతున్నది. మొత్తం 3,58,579 దరఖాస్తులు రాగా, బుధవారం వరకు 2,42,916 దరఖాస్తులను ధ్రువీకరించారు. 27,155 దరఖాస్తులను తిరస్కరించారు.

ఇంకా 88,508 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది. అత్యధికంగా కరీంనగర్ జిల్లా నుంచి 76,388 దరఖాస్తులు అందగా, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 2,672 దరఖాస్తులు అందాయి. 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్షా 97 వేల మంది ఓటర్లు ఉండగా ఈసారి లక్షా 50 వేల వరకు పెరగనున్నారు. 

జిల్లాల వారీగా దరఖాస్తులు

కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో నాలుగు ఉమ్మడి జిల్లాలు ఉన్నారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 76,388 దరఖాస్తులు వచ్చాయి. జగిత్యాల జిల్లా నుంచి 34,691, పెద్దపల్లి నుంచి 29,688, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 22,160 దరఖాస్తులు వచ్చాయి. అసిఫాబాద్ జిల్లా నుంచి 5,819, మంచిర్యాల నుంచి 30,321, ఆదిలాబాద్ నుంచి 14,733, నిర్మల్ నుంచి 17,650 దరఖాస్తులు అందాయి.

నిజామాబాద్ జిల్లా నుంచి 29,514, కామారెడ్డి నుంచి 15,249 దరఖాస్తులు అందాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సంగారెడ్డి జిల్లా నుంచి 28,400, మెదక్ జిల్లా నుంచి 13,746, సిద్దిపేట జిల్లా నుంచి 32,270 దరఖాస్తులు అందాయి. పూర్వ కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండి ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో కలిసిన నాలుగు మండలాల నుంచి 4,718, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలిసిన ఐదు మండలాల నుంచి 2,672 దరఖాస్తులు అందాయి. 

ఓట్లపై నేతల లెక్కలు

ఎమ్మెల్సీ స్థానానికి పోటీకి సిద్ధమవుతున్న నేతలు పోటాపోటీగా ఎన్‌రోల్‌చేసి మేమంటే మేము అత్యధికంగా ఎన్‌రోల్ చేశామని చెప్పుకుంటున్నారు. ఇప్పటి నుంచే తమకు అనుకూలంగా వచ్చే ఓట్లపై లెక్కలేసుకుంటున్నారు. ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్ ముగియడంతో ఆశావహులు తమ ప్రచార పంథాను మార్చనున్నారు.

ఇన్ని రోజులు ఎన్‌రోల్‌మెంట్ మీద దృష్టి సారించిన వీరంతా ఎన్‌రోల్ అయిన ఓటర్ల జాబితాలో ఉన్నవారిని కలిసే ప్రయత్నం చేయనున్నారు. గ్రూప్ మీటింగ్‌లు, కులాల వారీగా సమీకరణాలు ఉధృతం కానున్నాయి.

వచ్చే సంవత్సరం మార్చిలో ఎన్నికలు జరగనుండగా ఇప్పటి నుంచే ప్రచారంలో మునిగి తేలేందుకు వ్యూహ రచనలు చేసుకుంటున్నారు. 20 మంది వరకు ఆయా పార్టీల టికెట్ల కోసం కొందరు ప్రయత్నిస్తుండగా, మరికొందరు టికెట్ వచ్చినా, రాకున్నా బరిలో ఉండేందుకు సిద్ధం అవుతున్నారు. 

డిసెంబర్ 30న తుది జాబితా విడుదల

అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తు బీఎల్‌వోలకు వెళ్తుండగా, బీఎల్‌వోలు పరిశీలించి ఏఈఆర్‌వోకు పంపిస్తున్నారు. ఏఈఆర్‌వో ధ్రువీకరణ అనంతరం ఈఆర్‌వోకు వెళ్తుంది.

ఈఆర్‌వో ధ్రువీకరణ అనంతరం నమోదు ప్రక్రియ ముగుస్తుంది. మిగిలిన దరఖాస్తులను పరిశీలించేందుకు మరొక వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. గడువులోగా దాఖలైన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఈ నెల 23న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించనున్నారు.

ముసాయిదా జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 23 నుంచి డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ డిసెంబర్ 30న విడుదల చేస్తుంది. 

మొదటి ప్రాధాన్యతతో గెలుపు కష్టమే!

పట్టభద్రుల నమోదు ఎక్కువ కావడంతో పాటు పోటీదారులు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవడం కష్టమే. మొదటి ప్రాధాన్యతతో గెలవాలంటే 51 శాతం ఓట్లు రావాలి.

లేకుంటే రెండవ ప్రాధాన్యత, అప్పటికీ కాకుంటే మూడు, నాలుగు, ఇలా వరుసగా కింది నుంచి అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ ఓట్లను లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యతతో 51 శాతం ఓట్లు ఎవరికి రాకుంటే మిగతా ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి కావాలంటే రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది.