స్టార్ హీరో సూర్య తాజా చిత్రం ‘కంగువ’. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నా రు. ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శివ మీడియాతో ముచ్చటిస్తూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ‘కొన్ని స్క్రిప్ట్స్ జ్ఞానవేల్‌కు చెప్పినప్పుడు కంగువ ఆయనకు బాగా నచ్చింది.
సూర్యకు స్క్రిప్ట్ నెరేట్ చేస్తే ఓకే చేశారు. త్రీడీ చిత్రాల్లో కంగువ ఒక బెస్ట్ మూవీ అవుతుంది. సూర్య కంగువ, ఫ్రాన్సిస్ అనే రెండు పాత్రల్లో కనిపిస్తారు. కంగువ వెయ్యేళ్ల కిందట వీరుడి పాత్ర. ఈ పాత్రకు హద్దులు లేవు, ఎవరూ నియంత్రించలేరు. ఫ్రాన్సిస్‌ను కొన్ని అంశాలతో కంట్రోల్ చేయవచ్చు. ఈ పీరియాడిక్ పాత్రతోపాటు మోడరన్ క్యారెక్టర్‌లో సూర్య పర్‌ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. సూర్య మంచి జిమ్నాస్ట్ అనేది చాలా మందికి తెలియదు.
షూటింగ్ టైమ్‌లో ఆయన ఫిట్‌నెస్ బాగా యూజ్ అయ్యింది. ఎంత పెద్ద కథైనా రాసుకోవడం సులువు. కానీ తెరకెక్కించడం కష్టం. మేము నాచురల్ లొకేషన్స్‌కు వెళ్లి అక్కడ సెట్స్ వేసి సినిమా చేశాం. నా టీమ్ నాకు అలాంటి సపోర్ట్ ఇచ్చింది. అందుకే టైటిల్ క్రెడిట్స్‌లో శివ అండ్ టీమ్ అని వేస్తున్నాం.
ఈ సినిమాలో ఒక సర్‌ప్రైజింగ్ అతిథి పాత్ర ఉంటుంది. అది కంగువ సీక్వెల్‌కు లీడ్ ఇస్తుంది. ఆ క్యారెక్టర్ ఎవరు చేశారనేది మీరు స్క్రీన్ మీద చూడాలి. నా దగ్గర ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అవకాశం వస్తే తప్పకుండా తెలుగు స్టార్స్‌తో సినిమాలు చేస్తా” అని చెప్పారు.