భద్రాచలం (విజయక్రాంతి): పాత తరం ఆదివాసి గిరిజనులు అడవులలో సహజంగా ప్రకృతి పరంగా దొరికే కరక్కాయలతో పొడిచేసుకొని ఎటువంటి కల్తీ లేని స్వచ్ఛమైన తేనీరు సేవించి వంద సంవత్సరాలు పైనే జీవించారని, అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే గిరిజన మహిళలు తయారుచేసిన తేనీరు, మంచి వనమూలికలతో తయారుచేసిన కాఫీ ప్రతి ఒక్కరు కొనుగోలు చేసి వారి జీవనోపాధికి తోడ్పాటు అందించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. బుధవారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రోడ్డులోని గోపాలకృష్ణ థియేటర్ ఎదురుగా ఆదివాసి కాఫీ సెంటర్ ఐటిడిఏ సహకారంతో నెలకొల్పిన కాపీ సెంటర్ ను పూజలు నిర్వహించి ఆయన ప్రారంభించారు. షాపులో సందర్శనకు వచ్చే ప్రజలకు తయారు చేస్తున్న రాగి దోశ, ఇతర ఆహార పదార్థాలను ఆయన పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజన మహిళలు ఇంటిపట్టునే ఖాళీగా ఉండకుండా చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకొని ఆదివాసి మహిళలు ఎటువంటి కల్తీ లేకుండా సహజంగా దొరికే కరక్కాయ గింజలు వనమూలికల పొడితో వారే సొంతంగా తయారు చేసి అమ్మకాలు జరిపి ఆర్థికంగా లబ్ధి పొంది జీవనోపాధి కల్పించుకుంటున్నారని, ప్రతి సోమవారము ఐటిడిఏ కార్యాలయానికి వచ్చే ప్రజలకు, ముఖ్య సందర్భాలలో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రముఖులకు సరసమైన ధరలకు అమ్మకాలు జరుపుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఎటువంటి కల్తీ లేకుండా వారు సొంతంగా తయారు చేసిన రాగి, జొన్న, సజ్జలతో తయారు చేసిన దోష, కాఫీ ప్రతి ఒక్కరు సేవించి కొనుగోలు చేసి వారి జీవనోపాధికి తోడ్పాటు అందించాలని, వీరు తయారు చేసిన వస్తువులు శరీరానికి ఎటువంటి రుగ్మతలు రాకుండా అన్ని సమపాళ్లల్లో కలిపి తయారుచేస్తారని, అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే దోష తేనీరు, కాఫీ ఇంటిల్లిపాది సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన అన్నారు.
దేవస్థానానికి వచ్చే భక్తులకు వీరు తయారు చేసే దోషలు, కాఫీ సరసమైన ధరలకు అందించి, వీటి యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలా మహిళలు వాటి తయారీ విధానం గురించి షాపుకు వచ్చే ప్రజలకు భక్తులకు తెలియజేయాలని, అలాగే వీటికి సంబంధించిన ధరల జాబితా తయారుచేసి షాప్ ముందు ప్రదర్శించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డిఓ ఉదయ్ కుమార్, ఆర్గనైజర్ రాజేంద్రప్రసాద్, ఆదివాసి కాపీ సెంటర్ మహిళలు రమ తదితరులు పాల్గొన్నారు.