గువహటి (అస్సాం), జూలై 7: పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని మందలించిన టీచర్‌నే ఓ విద్యార్థి పొట్టనపెట్టుకున్నాడు. విద్యార్థి కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావం కాగా ఇతర విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్కూల్‌లో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు రాజేశ్ బారువా ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో విద్యార్థిని మందలించాడు ఇంటికెళ్లి తల్లిదండ్రులను తీసుకురమ్మని పంపాడు. కొంత సమయం తర్వాత సదరు విద్యార్థి మామూలు దుస్తుల్లో తరగతి గదికి వచ్చాడు. ఇది గమనించిన రాజేశ్.. వెంటనే ఇంటికి వెళ్లాలని ఆదేశించాడు. దీంతో కోపోద్రిక్తుడైన విద్యార్థి తన వద్దనున్న కత్తితో రాజేశ్‌ను పలుమార్లు పొడిచాడు. ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. ఇతర విద్యార్థుల సమాచారంతో స్కూల్ యాజమాన్యం రాజేశ్‌ను ఆసుపత్రికి తరలించింది. కానీ, అప్పటికే రాజేశ్ మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.