calender_icon.png 15 January, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థిని ఆత్మహత్య

01-09-2024 02:23:06 AM

  1. రుద్రూరులోని జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ హాస్టల్‌లో ఘటన
  2. తల్లిదండ్రులు రాకముందే పోస్టుమార్టం
  3. వ్యతిరేకించిన విద్యార్థులు, హాస్టల్‌లో ఉద్రిక్తత

నిజామాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ మండలంలోని అక్బర్‌నగర్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హుస్నాపూర్‌కు చెందిన లింగ్‌వాడ్ రక్షిత(15) వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నది. ఐదు రోజుల క్రితమే రక్షిత హాస్టల్‌లో చేరింది.

ఇంతలోనే శనివారం హాస్టల్‌లోని బాత్‌రూంలో కిటికీ ఊచలకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని రుద్రూర్ సీఐ జయేష్‌రెడ్డి, ఎస్సై సాయన్న పరిశీలించారు. రక్షిత తల్లిదండ్రులు రాకముందే పోలీసులు రక్షిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీంతో కళాశాల విద్యార్థులు హాస్టల్‌లో ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.