calender_icon.png 18 January, 2025 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒత్తిడి లేని విద్యావిధానం రావాలి

14-01-2025 12:00:00 AM

‘జాతీయ క్రైమ్ బ్యూరో’ లెక్కల ప్రకారం భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యల్లో 9% ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. వీటిలో మెజారిటీ విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతున్న  వారే కావడం గమనార్హం. బ్యూరో రికార్డ్స్ (2022) ప్రకారం విద్యార్థుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు 10, 11వ స్థానాల్లో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు అధిక శాతం మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ విద్యారంగం కార్పొరేట్ శక్తుల కబంధహస్తాల్లో ఉండడమే. వారి ప్రభావం మూలంగా గత మూడు దశాబ్దాలలో ఇంటర్ విద్యలో ఎలాంటి సంస్కరణలు జరుగలేదు. కార్పొరేట్ శక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం పోటీ ప్రపంచంలో తామంటే తాము ముందున్నామని ప్రజలను నమ్మించడానికి  విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు దాదాపుగా 11.5 లక్షలమంది విద్యార్థులు  హాజరవుతున్నారు. వీరిలో అధిక శాతం గ్రామీణ పేద విద్యార్థులు. వీరంతా ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ, స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రైవేటు జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించే వారే. వీరికి వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయిల పోటీ పరీక్షలకు శిక్షణ గగనసదృశం.

తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి వరకు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం, ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్‌సీ పరీక్షల విధానం అమలులో ఉంది. పదవ తరగతి, ఇంటర్ సిలబస్‌ల మధ్య చాలా వైవిధ్యం ఉంటున్నది. పదవ తరగతి బోర్డు పరీక్షలలో ప్రశ్నాపత్రం విధానానికి ఇంటర్ పరీక్ష ప్రశ్నాపత్రం పద్ధతికి కూడా మౌలికంగా చాలా తేడాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ఆగస్టులో పూర్తవుతాయి. 

ఫస్ట్ ఇయర్ బోర్డు పరీక్ష వద్దు!

పరీక్షలు మార్చి మొదటి వారంలో ఉంటాయి. విద్యా ర్ధి కేవలం 6 నెలలలో సిద్ధమై బోర్డు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వారు మొదటగా ఒక గ్రూపు ఎంపిక చేసుకుని, తరువాత వివిధ కారణాలవల్ల వేరే గ్రూపుకు మారుతుంటారు. అలాంటి విద్యార్థులకు మరింత తక్కువ సమయం దొరుకుతుంది. ఈ విధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులు చాలా ఒత్తిడితో పరీక్షలకు హాజరవుతున్నారు.

దీని ప్రభావంతో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణతా శాతం తక్కువగా ఉంటుంది. అలాంటి విద్యార్థులు ఇంటర్ రెండ వ సంవత్సరంలో గతంలో ఫెయిలైన సబ్జెక్టులు, రెండవ సంవత్సరం సబ్జెక్టులు కలిపి పరీక్షలకు ఒకేసారి హాజరు కావలసి వస్తుండడం వల్ల రెండింటిలోనూ ఉత్తీర్ణతను సాధించలేక పోతున్నారు. ఇంటర్ విద్యార్థులపై ఉంటున్న ఈ పరీక్షల ఒత్తిడిని నివారించవలసి ఉంటుంది. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం ఆత్మహత్యలకు గురవుతున్న విద్యార్థులలో అత్యధిక శాతం ఇంటర్ విద్యార్థులే అని గణాంకాలు చెబుతున్నాయి.

ఇంటర్ ఫలితాలు వెలువడిన ప్రతీసారి విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా, ఈ విద్యార్థులు కోర్సు మొదలయిన రోజు నుంచి ఫలితాలు వచ్చేవరకు రెండు సండేళ్లపాటు నిరంతర ఒత్తిడిలో ఉంటున్నారన్నది నిజం. దీనికి బోర్డు పరీక్షలు, కార్పొరేట్ శక్తులు, తల్లిదండ్రుల ఒత్తిడి వంటివన్నీ తమతమ పరిధిలో కారణమవుతున్నాయి. విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించడం ద్వా రా వారి అభ్యసన సామర్థ్యాలు మెరుగు పడతాయని పరిశోధనల ద్వారా ఋజువైంది.

ఉభయ తెలుగు రాష్ట్రా ల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బోర్డు పరీక్షలను రద్దు చేసి అంతర్గత మూల్యాంకనం ద్వారా విద్యా ర్థుల అభ్యసనా స్థాయిని నమోదు చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మన విద్యార్థులుకూడా భయరహితంగా పరీక్షలకు సిద్ధమవుతారు.  విద్యార్థుల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలు సంస్కరణలు చేయడం ద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తాయని ఆశిద్దాం.

 అనుమాండ్ల వేణుగోపాల్ రెడ్డి, పాకాల శంకర్ గౌడ్