చలాది పూర్ణచంద్ర రావు :
ఒకవైపు పశ్చిమాసియా దేశాల్లో అతి చిన్న దేశం ఇజ్రాయెల్ ఒంటరిగా ఒకేసారి ఇరాన్,పాలస్త్తీనా దేశాలతో జరుపుతున్న యుద్ధం సృష్టిస్తున్న మారణ హోమం ప్రపంచ అగ్ర దేశాలకు సైతం ఆందోళన కలిగిస్తుండగా -మరోవైపు దక్షిణాసియాలోనే అతిపెద్ద దేశం భారత్, ఆగ్నేయాసియాలోని మలేషియాలు తమ మధ్య వున్న స్నేహ బంధాలను మరింత దృఢ పరుచుకుంటున్నాయి. ఇందుకు సమన్వయం, సామరస్యత, నేతల మధ్య సుహృద్భావం గల విదేశీ విధానం ఉంటే తప్ప సాధ్యం కాదనేది ఈ రెండు దేశాల నేతలు తాజాగా మరోసారి రుజువు చేశారు.
శతాబ్దాల బంధం
శతాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ వాణిజ్య సంబంధాలతో పాటు ఇరుదేశాలకు మరింత ప్రయోజనం కల్గించే అనేక అంశాల్లో స్నేహ సంబంధాలు గత పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టాక అమలు చేస్తున్న విధానాల కారణంగా ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత బలపడుతున్నాయని చెప్పాలి.
ఈ రెండు దేశాల మధ్య వర్తక వాణిజ్య సంబంధాలే కాకుండా పర్యాటకం, విద్య, వ్యూహాత్మక రంగాల్లో కూడా సంబంధాలు మరింత బలపడ్డాయి.గత ఆగస్టులో మలేషియా ప్రధాని అన్వర్ బిన్ ఇబ్రహీం భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని మోడీ తో జరిపిన సంప్రదింపుల్లో రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలు భవిష్యత్‌లో ఇరుదేశాల సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతాయనే విషయం తథ్యం.
కాగా మలేషియాలో ఎప్పటినుండో నివసిస్తున్న సుమారు 30 లక్షల మంది ప్రవాస భారతీయులు రెండు దేశాల మధ్య ఈ సంబంధాలు ఇంతగా పెరిగేందుకు వారధిగా పని చేస్తున్నారని చెప్పాలి. గత ఏడాది మలేషియాలో నిర్వహించిన పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ డే ’(పిఐఓడే’ )సంబరాలు ఇరుదేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందాయి.
అలాగే భారత నూతన పార్లమెంట్ ప్రారంభం సందర్భంగా ఆ భవనంలో ’సెంగోల్’ ను ఏర్పాటు చేసినప్పుడు ఆ చారిత్రాత్మక కార్యక్రమం మలేషియా ప్రజల్లో ఉద్విగ్నత కల్గించింది. అలాగే ఇరుదేశాల మధ్య ప్రజల రాకపోకలను మరింత సులభతరం చేస్తూ వీసా నిబంధనల్ని కూడా సడలించడం జరిగింది.
అత్యాధునిక కోర్సులైన సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ ల్లో ఐటిఇసి ఉపకార వేతనాల కింద మలేషియా విద్యార్థులకోసం ప్రత్యేకంగా భారత్ వంద సీట్లను కేటాయించడంతో పాటు, మలేషియాలోని యూనివర్సిటీ ఆఫ్ టుంకు అబ్దుల్ రహమాన్ నందు ఆయుర్వేద పీఠాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఒప్పందం జరిగింది.
ఇంకా మలేషియాలోని విశ్వవిద్యాలయంలో తమిళనాడుకు చెందిన ప్రముఖ తమిళ కవి, తత్వవేత్త తిరువళ్ళువార్ పీఠాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
గత రెండేళ్లుగా ఇబ్రహీం చొరవతో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం వేగాన్ని, శక్తిని పుంజుకుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని భారత కరెన్సీ రూపాయల్లోను, అలాగే మలేషియా కరెన్సీ అయిన రింగిట్ లోకూడా కొనసాగించే అంగీకారం కుదిరింది. గత ఏడాది భారత్‌లో మలేషియా 5 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టింది.
సెమీ కండక్టర్లు, ఫైనాన్షియల్ టెక్నాలజీ , రక్షణ రంగ పరిశ్రమలు, కృత్రిమ మేధ(ఏఐ ),క్వాంటమ్ మొదలైన ఆధునిక సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని తప్పకుండా పెంచుకోవాల్సి వుందని నిర్ణయించటం తోపాటు డిజిటల్ మండలిని ఏర్పాటు చేయాలని, డిటేజర్ సాంకేతికత విషయంలో సహకారం కోసం ప్రారంభ దశలో ఉన్న వాణిజ్యసంస్థల కూటమిని కూడా ప్రారంభించాలని అంగీకారానికి వచ్చాయి .
భారత్ యుపిఐని మలేషియా పేనెట్‌తో అనుసంధానించే ప్రక్రియకూడా చేపట్టబోతుండటం మరో ముందడుగని చెప్పాలి. ఉగ్రవాదం, తీవ్రవాదంపై పోరాటానికి రెండు దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించటం జరిగింది.
భారత్, ఆసియన్ దేశాల మధ్య ఎన్టీఏపై సమీక్షను పూర్తి చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. 2025లో 47 ఆసియన్ దేశాలకు (ఎఎస్‌ఐఎఎన్ ) అధ్యక్ష స్థానంలో ఉన్న మలేషియాలో సదస్సు విజయవంతంగా నిర్వహించేందుకు భారత్ తనవంతు సహకారం పూర్తి స్థాయిలో మద్దతు, చేయూత ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
ఇదే సమావేశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, యుఎన్‌హెచ్‌ఐ ఆర్‌సి, ఇంకా ఇతర బహుపాక్షిక వేదికలతోపాటు సమితిలో సహకారాన్ని, సమన్వయాన్ని బలోపేతం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి.
ముఖ్యంగా భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనకు మలేషియా మద్దతు తెలిపింది. ఇందుకు మలేషియా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియ చెయ్యటం భారతీయులుగా మన కనీస బాధ్యత.
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
సెల్: 9491645699