calender_icon.png 19 April, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కలకు వింత వ్యాధి?

18-04-2025 01:57:38 AM

  1. గోమార్ల కారణంగా చర్మ వ్యాధులు
  2. జనంపై దాడులకు దిగుతున్న శునకాలు 

మహబూబాబాద్, ఏప్రిల్ 17  (విజయక్రాంతి): వీధి కుక్కలను గోమార్లు (టిక్స్) పట్టిపీడిస్తుండడంతో వందలాది శునకాలు చర్మం వడలిపోయి భయంకరంగా మారుతున్నాయి. గోమార్ల బారినపడ్డ కుక్కలు ఇతర కుక్కలతో తిరగడం వల్ల వాటికి కూడా ఈ వ్యాధి అంటుకొంటుంది. దీంతో రోజురోజుకు  ఇలాంటి కుక్కల సంఖ్య పెరుగు తోంది.

ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వీధి కుక్కలు చర్మం ఊడిపోయి జుగుప్సాకరంగా తిరుగుతున్నాయి. నిత్యం వీధుల్లో సంచరిస్తున్న వీటిని చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రోజురోజుకు వీటి సంఖ్య పెరుగుతుండడం వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

పంచాయతీ, మున్సిపల్ అధికారులు స్పందించాలి

గోమార్ల బారిన పడి వింత వ్యాధులతో వీధుల్లో తిరుగుతున్న కుక్కలను అరికట్టడానికి గ్రామపంచాయతీ, మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గోమార్ల బారిన పడి శరీరం వడలిపోయిన శునకాలకు వైద్యం అందించాలంటున్నారు. బయట తిరగాలంటే పిల్లలు భయపడుతున్నారు.

పిచ్చికుక్కల దాడిలో 9 మందికి తీవ్ర గాయాలు 

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో గురువారం తెల్లవారుజామున  పిచ్చికుక్కలు స్త్వ్రర విహారం చేశాయి. రోడ్డుపై నడిచి వెళుతున్న వారితోపాటు ఇంటి ఆవరణలో ఉన్న వారిపై దాడి చేశాయి. పలువురికి తల, చెవి, ముక్కులకు తీవ్ర గాయాలయ్యాయి.

తీవ్రంగా గాయపడ్డ మహబూబీ, రవి, సారయ్య, అల్లావుద్దీన్, సాయిలు, కోమల, పాపయ్య, ఎల్లయ్య, అనూషకు స్థానిక ఆరోగ్య ఉప కేంద్రం వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేసి.. కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో జిల్లా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి రంజిత్.. సిబ్బంది చేత కుక్కలను పట్టించారు.

పిల్లలు భయపడుతున్నారు..

 చర్మం ఊడిపోయి వీధుల వెంట సంచరిస్తున్న శునకాలను చూసి చిన్న పిల్లలు భయపడుతున్నారు. బడికి వెళ్లాలన్నా.. ఆడుకోవడానికి వెళ్లాలన్న వారి వెంట పెద్దలు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి పిచ్చికుక్కల బెడద, చర్మ సంబంధ జబ్బులతో బాధపడుతున్న శునకాలను గ్రామాల్లో సంచరించకుండా చర్యలు తీసుకోవాలి. 

 అరిగే విజేందర్, గ్రామస్తుడు, ఉప్పరపల్లి

హస్పిటల్‌కు తీసుకువస్తే వైద్యం చేస్తాం

గోమార్ల బారిన పడ్డ కుక్కలను హాస్పిటల్కు తీసుకువస్తే చికిత్స చేస్తాం. గోమార్లు పట్టిన శునకాలకు వెంటనే చికిత్స చేయాలి. లేకుంటే వాటి దేహమంతా పూర్తిగా దెబ్బతిని ఇతర కుక్కలకు వ్యాధి వేగంగా వ్యాప్తిస్తుంది. తద్వారా ప్రజలకు అసౌకర్యంగా మారుతుంది. గోమార్ల బారిన పడ్డ కుక్కలను వీధుల్లో తిరుగకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి.

 విజయ్‌కుమార్, పశు వైద్యాధికారి, కేసముద్రం