calender_icon.png 15 January, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచికి చేరని కథ.. గోడదూకు రాజా!

06-07-2024 01:25:43 AM

‘అభివృద్ధి’ పేరిట అనైతికం.. అధికారం కోసం రూలింగ్ పార్టీ వైపు

ఫిరాయింపుల్లో అన్ని పార్టీలది అదే తీరు

ఎన్నుకున్న ప్రజల విశ్వాసాన్ని వమ్ముచేస్తున్న ప్రజాప్రతినిధులు

ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, అవినీతికి అడ్డుకట్ట వేయాలని, సంతలో పశువుల్లా ప్రజాప్రతినిధులను కొనే సంస్కృతికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో 1985లో తెచ్చిందే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. చట్టం తమకు చుట్టంగా భావించే రాజకీయ నాయకులు ఈ చట్టానికే తూట్లు పొడుస్తున్నారు. చట్టంలో ఉన్న లొసుగులను సొమ్ము చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.

అవసరం లేకపోయినా ప్రతిపక్షాలను పూర్తిగా దెబ్బతీసేందుకు ప్రజాప్రతినిధులను తమ వైపునకు ఫిరాయించేందుకు ప్రోత్సహిస్తున్నారు. చాలా పార్టీలు ఈ విపరీత చర్యలకు పాల్పడుతున్నాయి. తెలంగాణలో సైతం ఫిరా యింపులు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపునకు లాక్కుంటే... ఇప్పుడు అదే దారిలో కాంగ్రెస్ పార్టీ పయనిస్తోంది. వరుసబెట్టి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ వైపునకు ఫిరాయించేలా చేస్తోంది.

ఆయారామ్... గయారామ్..

దేశంలో 1967 నుంచి 1983 మధ్యన వివిధ రాష్ట్రాల్లో 2700 మంది పార్టీ ఫిరాయించారు. ఇందులో 212 మందికి మంత్రి పదవులు లభించాయి. ఫిరాయించి ముఖ్యమంత్రులైన వారు 15 మంది. హర్యానాలో గయాలాల్ అనే ఎమ్మెల్యే ఏకం గా మూడుసార్లు పార్టీ ఫిరాయించారు. అందుకే ఆయన పేరుతో ఆయా రామ్... గాయా రామ్ అనే పేరు ఫిరాయింపులకు స్థిరపడింది. దేశంలో చోటుచేసుకుంటున్న ఫిరాయింపులను అరికట్టేందుకు కేంద్రం 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది. 

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఫిరాయింపులే...

  1. 2014లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మొదట ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీ ఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. అందుకు స్పీకర్ వెంటనే ఓకే చేశారు. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్ కృష్ణయ్య మాత్రం టీడీపీలోనే ఉండిపోయారు. 
  2. 2018లో ఎన్నికైన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వర్ రావు తమ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. అదే ఊపులో కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోయారు. 
  3. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ నుంచి మిత్ర పక్ష ఎమ్మెల్యేతో కలిపి తగినంత మెజారిటీతోనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చింది. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన పంథానే కాంగ్రెస్ కూడా ఫాలో అయ్యింది. అందులో భాగంగా ఫిరాయింపులను విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ అధికార పార్టీలో చేరిపోయారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, యెగ్గె మల్లేశం, దయానంద్ సైతం కారు దిగి హస్తం పార్టీలో చేరిపోయారు. పెద్దల సభకు చెందిన వీరు కూడా కనీస మర్యాదలు, సభా గౌరవాన్ని పాటించకుండా ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఇంత జరుగుతున్నా స్పందించాల్సిన స్పీకర్ మాత్రం కనీసం ఫిరాయింపుల ఫిర్యాదులకు తీసుకునేందుకు సైతం అందుబాటులో లేరు. అప్పుడూ ఇప్పుడూ స్పీకర్ తీరు ఇలాగే ఉంది. 
  4. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచిన లాస్య నందిత చనిపోయారు. దాంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38కు చేరింది. ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. త్వరలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు ఫిరాయింపులకు పాల్పడిన వారి సంఖ్య 12కు చేరుతుంది. వీరికి అదనంగా మరో 14 మంది కాంగ్రెస్ పార్టీలో చేరితే మొత్తం సంఖ్య 26 అవుతుంది. ఈ సంఖ్యతో బీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తోంది. ఆ దిశగా పావులు కదుపుతోంది. పక్కాగా బీఆర్‌ఎస్ పార్టీని విలీనం చేసుకుని గతంలో తమకు ఎదురైన ఫిరాయింపులకు గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
  5. ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారని అందుకే ఆయనపై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదు కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పీకర్ అందుబాటులో లేకుండా పోయారని ఆరోపించారు. స్పీడ్ పోస్ట్ ద్వారా, ఆఫీసు సిబ్బందికి అనర్హత వేటుకు సంబంధించిన ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆయన విమర్శించారు.
  6. ఇదే సందర్భంలో బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి తన నైతికను చాటుకున్నారు. 
  7. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో వారి ఇంటి ముందు చావు డప్పు కొట్టాలని అప్పటి పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆయన ఇంటి ముందు ఏ డప్పు కొట్టాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
  8. ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అని, తాము మాత్రం ప్రజాస్వామ్య బద్ధంగా చేర్చుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఎక్కడుంది.. టార్చ్‌లైట్ వేసి వెతకాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు.

అభివృద్ధి పేరుతో ఫిరాయింపులు

ఒక సాధారణ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 2 లక్షల మంది ఓటర్లుంటారు. తమ ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తిని, ఆయన పార్టీని చూసి తమ సమస్యలను తీరుస్తారని, ఐదేళ్లు తమకు అందుబాటు లో ఉంటారని విశ్వసించి ఓటేస్తారు. కానీ గెలిచిన ఎమ్మెల్యేకు సంబంధించిన పార్టీ అధికారంలోకి రాకుం టే చాలు సదరు ఎమ్మెల్యేకు అధికార యావ పెరిగిపోతుంది. ఎలాగై నా గోడ దూకి అధికార పార్టీలోకి ఫిరాయించాలని ప్రయత్నిస్తాడు. అదే సమయంలో అధికార పార్టీ సైతం ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను ఎలాగైనా తమ వైపునకు తిప్పుకుని, ప్రతిపక్షాన్ని బలహీనం చేయాలని ప్రణాళిక రచిస్తుంది. నయానో భయానో లొంగదీసుకుంటుంది. నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించి తాను పార్టీ మారినట్లు సదరు ఎమ్మెల్యే చెబితే.. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే క్రమం లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా తమ వైపునకు వస్తున్నారని అధికార పార్టీ చెబుతోంది.

అనర్హత వేటు ఎప్పుడు పడుతుంది

  1. ఫిరాయింపుల చట్టంలోని నిబంధనల ప్రకారం ఒక పార్టీకి చెందిన సభ్యుడు తనంతట తానుగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు
  2. పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా సభలో జరిగిన ఓటింగులో ఓటు వేసినప్పుడు
  3. ఎన్నికల తర్వాత ఒక ఇండిపెండెంట్ సభ్యుడు వేరే పార్టీలో చేరినప్పుడు

అనర్హత వేటు ఎప్పుడు ఉండదంటే..

  1. ఒక పార్టీ నుంచి మూడింట రెండొంతుల మంది ఒక వర్గంగా విడిపోయి వేరే వర్గంగా మారితే
  2. ఒక పార్టీ మొత్తం మరో పార్టీలో విలీనమైతే
  3. ఒక పార్టీ విడిపోయి అందులోని ఓ వర్గం వేరే పార్టీలో చేరుతున్నప్పుడు, వారితో పాటు అందులో చేరేందుకు ఇష్టపడక ప్రత్యేక వర్గంగా కొనసాగే సభ్యులపై.. 
  4. ఓటింగ్‌లో పాల్గొనేందుకు 15 రోజుల ముందు పార్టీ అనుమతి తీసుకుని ఓటింగ్‌కు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలపై..