ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అల్కరాజ్ సెమీఫైనల్లో ప్రత్యర్థి మెద్వెదెవ్‌పై నాలుగు సెట్లలో విజయాన్ని అందుకొని వరుసగా రెండోసారి గ్రాండ్‌స్లామ్ తుదిపోరుకు అర్హత సాధించాడు. సరిగ్గా నెలక్రితం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విన్నర్‌గా నిలిచిన అల్కారాజ్ తాజాగా వింబుల్డన్ టైటిల్‌పై గురి పెట్టాడు. నేడు జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో జాస్మిన్‌తో క్రెజికోవా అమీతుమీ తేల్చుకోనుంది.
లండన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ టోర్నీలో స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో అల్కరాజ్ 6 (1/7), 6 6 6 ఐదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై విజయాన్ని నమోదు చేసుకున్నాడు. కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకునేందు కు అల్కరాజ్ అడుగు దూరంలో నిలిచాడు. రెండేళ్ల వ్యవధిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మినహా మిగతా మూడు టైటిళ్లను ఒక్కోసారి గెలిచి గ్రాస్, క్లే, హార్డ్ కోర్టులపై తనకు తిరుగులేదని అల్కరాజ్ నిరూపించాడు.
21 ఏళ్ల అల్కరాజ్ తాజా వింబుల్డన్ టైటిల్ గెలిస్తే ఓపెన్ ఎరా శకంలో బోరిస్ బెక్కర్, జోర్న్ బోర్గ్ తర్వాత ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో మూడు మేజర్ టైటిల్స్ గెలిచిన పిన్న వయస్కుడిగా నిలవనున్నాడు. ఇంతకముందు యూఎస్ ఓపెన్ (2022), ఫ్రెంచ్ ఓపెన్ (2024), వింబుల్డన్ (2023) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గాడు. దాదాపు మూడు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను టై బ్రేక్‌లో కోల్పోయిన అల్కరాజ్ ఆ తర్వాత ప్రత్యర్థికి ఎక్కడా అవకాశ మివ్వలేదు.
వరుసగా మూడు సెట్లు గెలిచిన స్పెయిన్ చిన్నోడు వరుసగా రెండోసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ తుదిపోరుకు చేరుకున్నాడు. మ్యాచ్‌లో 6 ఏస్‌లు కొట్టిన అల్కరాజ్ 55 విన్నర్లు సంధించాడు. 5 ఏస్‌లు, 31 విన్నర్లకు పరిమితమైన మెద్వెదెవ్ ఆరు డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకున్నాడు.
పవోలిని x క్రెజికోవా
నేడు జరగనున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 7వ సీడ్ జాస్మిన్ పవోలినీ(ఇటలీ)తో 31వ సీడ్ బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) టైటిల్ పోరకు సిద్ధమైంది. నెల రోజుల వ్యవధిలో రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న పవోలిని మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో స్వియాటెక్ చేతిలో ఓడిన జాస్మిన్ రన్నరప్‌గా నిలిచింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా క్రెజికోవా సెమీస్‌లో నాలుగో సీడ్ ఎలీనా రిబాకినాను సునాయాసంగా ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. కాగా క్రెజికోవా గతంలో ఫ్రెంచ్ ఓపెన్ (2021) గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకుంది.