- రైల్వేలైన్ల నిర్మాణ పనుల్లో జాప్యం
- 2027 నాటికి కొత్తపల్లి-మనోహరాబాద్ లైన్ పూర్తి
- మార్చిలో అందుబాటులోకి కరీంనగర్ స్టేషన్
- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, జనవరి 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో చేపట్టిన రైల్వేలైన్ నిర్మాణ పనులకు కావాల్సిన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ భూసేకరణ సమస్య పరిష్కారం కాకపోవడంతో చాలా చోట్ల రైల్వే లైన్లు, ఆర్వోబీల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.
శుక్రవారం ఆయన కరీంనగర్ రైల్వే స్టేషన్, కొత్తపల్లి రైల్వే స్టేషన్‌ల పనులను పరిశీలించారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీని సందర్శించారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న కొత్తపెల్లి--మనోహరాబాద్ రైల్వే లైన్‌ను 2027 నాటికి పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు 2023 ఆగస్టులో రూ.44 కోట్ల 16 లక్షల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. మార్చి 31 నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేసి కరీంనగర్ స్టేషన్‌ను ఆదర్శ రైల్వే స్టేషన్‌గా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
సేతు బంధన్ పథకం కింద రూ.154 కోట్లతో చేపట్టిన ఆర్వోబీ పనులు గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరి కల్లా ఉప్పల్ ఆర్వోబీ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్ని బండి సంజయ్ తెలిపారు.
కేటీఆర్.. స్వాతంత్య్ర సమరయోధుడా?
కేటీఆర్ జైలుకు వెళ్తే బీఆర్‌ఎస్ నాయకులు గొడవ చేయడానికి ఆయనేమైనా స్వాతంత్య్ర సమరయోధుడా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్‌లో ఆయ న మీడియాతో మాట్లాడుతూ.. ఈనూ కేసులో కేబినెట్ అనుమతి లేకుండా సర్కార్ సొమ్మును అప్పనంగా విడుదల చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు.
తప్పుచేసి కప్పు పుచ్చుకోవడానికి రూ.700 కోట్ల లాభం వచ్చినట్లు డ్రామాలాడుతున్నారని అన్నారు. ఆ సొమ్ము ఎక్కడ ఉందో ప్రజల ముందుంచాలన్నారు. లొట్టపీసు సీఎం, చిట్టినాయుడు, సన్నాసిగాడు అని తిడుతుంటే రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
కేసీఆర్‌తో రేవంత్‌రెడ్డి లోపాయికారీ ఒప్పందం చేసుకున్నట్లు అనుమానాలున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన స్కాంలు తెరపైకి వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్టపీసు వ్యవహారమేనని అన్నారు.