calender_icon.png 11 January, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవన్ముక్త స్థితి

13-12-2024 12:00:00 AM

చైతన్యమూ లోకమూ అనంతాలే! ఆదీ, అంత్యము ఎరుగనిది ఈ మహాసృష్టి! కాలం వలెనే ఇది ఆగనిది. అలుపెరుగనిది. నిశ్శబ్దంలోంచి శబ్దం; యోగంలోంచి యుగం; నిస్వనం నుండీ నాదం; నిష్క్రియ నుండీ క్రియ; అచేతన నుండీ చేతన; జననం నుండీ మరణం; మరణం నుండీ జననం; జననం నుండీ మనసు; మనసు నుండి ఆలోచన; ఆలోచన నుండీ కర్మ; కర్మల వల్ల వాసనలు; వాసనల నుండీ మూల వాసనలు.... ఎట్లా మరల, మరల ఏర్పడి, వేర్పడి, మళ్లీ మూలంలో కలుస్తూ, అనేకంగా కనిపిస్తున్నదో అదంతా లోకమే! ఈ లోకం జడ చైతన్యాల కలబోతగా ప్రత్యక్షంగా ఉన్నది. సమష్టిగా కనిపిస్తున్న ఈ లోకానికి సంక్షిప్త రూపమే మానవుడు. ‘మా’ అంటే కాదు. ‘నవ’ అంటే క్రొత్త! అంటే, మానవుడు క్రొత్తవాడు కాదు. సనాతనుడు, సనూతనుడై సంచరిస్తున్నాడు. అంతే!

కనుక జీవుడు -జగత్తు బింబ -ప్రతిబింబ భావంతో సృష్టిని రసప్లావితం చేస్తున్నారు. ‘రసము’ అంటే ఈశ్వరుడే! అంటే, అవి ఈశ్వర చైతన్యాన్ని అనేక క్షేత్రాలలో ప్రవహింపచేస్తున్నవి. లోకాన్ని వీడి రస ము లేదు. రసమెరుగని లోకం లేదు!! ఇక జగదీశ్వరుడు ఎవరు? జీవజగత్తుల స్థితులను సమతుల్యంగా నడిపిస్తున్న ఆత్మే భగవంతుడు! ఈ ఆత్మ, దేహంలో శబ్దమయంగా ‘నేను’.. ‘నేను’ అంటున్నది కనుక దైవానికి మొదటి పేరు ‘నేను’! భగవద్గీత నిండా కృష్ణపరమాత్మ నోట పలికిన నేను, ఈ నేనే! అందుకే వ్యాసుల వారు ఎక్కడా శ్రీకృష్ణ ఉవాచ అనకుండా ‘భగవాన్ ఉవాచ’ అన్నారు. ఇన్ని కారణాల వల్ల లోకం, లోకేశ్వరుడు, జీవుడు కలిపి ఒక అద్భుత త్రిపుటి ఏర్పడింది. ఈ మూడిటిలో ఓంకారం అంతర్వాహినిగా, నిస్తంద్రమంద్ర నిస్వన నాదంగా, ఊపిరిగా, ప్రాణంగా, వాయువుగా, ఆయువు గా, చైతన్యంగా కదులుతూ, కదిలిస్తూనే ఉన్నది.

కనుక కదులుతున్న దేహమంతా ఓంకార నాదమయమే. 21,600 సార్లు జరుగుతున్న ప్రాణాయామమంతా ఓంకార ప్రసారమే!

‘అ’ ‘ఉ’ ‘మ’ అనే ప్రణవాంతర్గతమైన నాదబిందువులే మూడు అవస్థలకు సంకేతాలు!

శూన్యం నుండీ ప్రారంభమై పూర్ణం వైపు సాగినా, పూర్ణం నుండీ శూన్యం వైపు జరిగినా, ఓంకారమే ఈ సృష్టిని ఆవహించిన చైతన్య భూమిక!

అది శూన్యపూర్ణాల కలయిక! జడ చైతన్యాలను జాగృతం చేయగల మహా ప్రేరక శక్తి, చోదకశక్తి ప్రణవ ధ్యానంతో ఇంద్రియాలు, మనసు నెమ్మదిస్తయ్. ఇదే నిగ్రహం. ప్రశాంత, ప్రసన్న స్థితిలో ‘ఆత్మ’ మనిషిని సాక్షీభూత స్థితికి చేరుస్తుంది.

కప్ప గెంతులు ఆగి, కళ్ళ గంతలు వీడి, స్వస్వరూప అనుసంధానం సహజంగా జరిగిపోతుంది. మనిషి జీవన్ముక్తు డౌతాడు! అప్పుడు దేహం సైతం ఆత్మగా శోభిల్లుతుంది! ఇదే మాండూక్యోపనిషత్ సారం.

 వి.యస్.ఆర్.మూర్తి