హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)లో చీలిక వచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే కొత్తగా మరో రెవెన్యూ సంఘం ఏర్పాటు కాబోతుంది. ట్రెసాలో కీలకంగా పనిచేయడంతో పాటు ప్రస్తుతం ట్రెసా రాష్ట్ర ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న ఓ అధికారి నేతృత్వంలో నూతనంగా ‘తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్’ (టీజీఆర్‌ఎస్‌ఏ) ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది.
గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నా, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దుచేసి ఇతర శాఖలలో విలీనం చేసినా టీజీవో, టీఎన్‌జీవో సంఘాలు ప్రతిఘటించలేదని, అయితే ప్రస్తుతం ట్రెసా నాయకత్వం టీజీవో, టీఎన్‌జీవో సంఘాల ప్రతినిధులతో చెట్ట పట్టాలేసుకుని తిరగడమేమిటని ట్రెసాలోని ఓ వర్గం నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగులను పట్టించుకోని టీజీవో, టీఎన్‌జీ వో సంఘాలతో ట్రెసా జతకట్టాల్సిన అవసరంలేదని వారు నిలదీస్తున్నారు.
అయితే ట్రెసాలో కీలకంగా ఉన్న ఓ వ్యక్తి ఉనికి కోసమే టీజీవో, టీఎన్‌జీవో నాయకుల చుట్టూ తిరుగుతు న్నాడు తప్ప, రెవెన్యూ ఉద్యోగుల హక్కుల కోసం కాదని ట్రెసా నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమై న ఓ అధికారి ‘విజయక్రాంతి’కి తెలిపారు. ఇప్పటికే ట్రెసా నుంచి బయటకొచ్చి నూతన సంఘం ఏర్పాటు చేసుకునేందుకు రంగం సిద్ధమైందని, మెజా ర్టీ సభ్యులు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.