calender_icon.png 31 October, 2024 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ జనాభా ఎంపరికల్ డేటా సేకరణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి

31-10-2024 01:18:59 AM

వారంలోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా వెనుకబడిన బీసీ జనాభా ఎంపరికల్ డేటా సేకరణ నిమిత్తం నియమించిన బీసీ కమిషన్ స్థానంలో డెడి కేటెడ్ (అంకితభావంతో) కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న పిటిషనర్ ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తిని తక్షణం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఈ ఉత్తర్వులు అందిన వారం లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలం టూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కల్పన నిమిత్తం రాజకీయంగా వెనుకబడిన వర్గాల (బీసీ) జనాభా గణాంకాల సేకరణ నిమిత్తం ప్రత్యేక కమిషన్‌గా బీసీ కమిషన్‌నే ప్రభుత్వం పేర్కొనడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, బీసీ కమిషన్‌నే ప్రత్యేక కమిషన్‌గా ప్రభుత్వం పేర్కొనడం డాక్టర్ కే కృష్ణమూర్తి, వికాస్ క్రిష్ణారావు గవాలి కేసుల్లో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులకు విరుద్ధమని తెలిపారు.

బీసీ కమిషన్ చట్టం కింద బీసీ కమిషన్ ఏర్పాటవుతుందని, ఇది బీసీలకు కల్పించిన రిజర్వేషన్ల సమీక్ష నిమిత్తం ఏర్పాటవుతుందన్నారు. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పన నిమిత్తం వాస్తవ గణాంకాల సేకరణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

రాజ్యాంగంలోని అధికరణ 243డి(6), 243టి(6)లకు భాష్యం చెబుతూ సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కృష్ణమూర్తి కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం చేయాల్సి ఉందన్నారు.  మహారాష్ట్రలో బీసీ కమిషన్‌నే ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌గా నియమించగా, అది ఇచ్చిన మధ్యంతర నివేదికను సుప్రీం కోర్టు రద్దు చేసిందన్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బాంథియా కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు.

బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక రిజర్వేషన్ల పునఃసమీక్షకు తప్ప రాజకీయ రిజర్వేషన్ల కల్పనకు గణాంకాలుగా పరిగణించరాదన్నారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో  అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరై ఉదయం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించాలని న్యాయమూర్తిని కోరారు.

రెండున్నర నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన దశలో ఈ ఉత్తర్వులు సరికాదన్నారు. 2021లో ప్రభుత్వం జీవో 9 జారీ చేసిందని తెలిపారు. ఈ జీవో అమలు నిమిత్తం తిరిగి జీవో 47 జారీ చేస్తూ గణాంకాల సేకరణకు విధివిధానాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ జీవోలు జారీ చేసినందున సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని చెప్పడానికి వీల్లేదని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుల అమల్లో భాగంగా ప్రభుత్వం ఈనెల 9న జీవో 47 జారీ చేసిందన్నారు.

ఈ జీవోను పిటిషనర్లు సవాలు చేయలేదని తెలిపారు. దీనిపై పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది బీ ఎస్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయంగా వెనుకబడిన వర్గాల వాస్తవ గణాంకాల సేకరణకే ‘ప్రత్యేక కమిషన్’ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఏజీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నామని, ఒకవేళ అభ్యంతరాలుంటే మధ్యంతర ఉత్తర్వుల తొలగింపునకు కౌంటరుతోపాటు పిటిషన్ దాఖలు చేసుకోవాలని తేల్చి చెప్పారు.

రాజ్యాంగంలోని అధికరణ 340, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పన నిమిత్తం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం ఏశారు. బీసీ కమిషన్‌నే ప్రత్యేక కమిషన్‌గా పరిగణించాలంటూ ఈనెల 9న ప్రభుత్వం జారీ చేసిన జీవో 47 సరికాదని, ఇది సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగంతో విభేదిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాజకీయాల్లో వెనుకబాటుతనాన్ని స్వతంత్రంగా, విలక్షణంగా అధ్యయనం చేసి వాస్తవ గణాంకాలు సేకరించాలని, ఇలా సేకరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ ప్రత్యేక కమిషన్ కాదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం బీసీ జనాభా వాస్తవ గణాంకాల నిమిత్తం అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడానికి బదులుగా బీసీ కమిషన్‌కే ఆ బాధ్యతలు అప్పగించినట్లుందని వ్యాఖ్యానించారు.

రాజ్యాంగం, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేయాల్సి ఉందని, అందువల్ల పిటిషనర్ విజ్ఞప్తిపై తక్షణం పరిశీలించి వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 21కి వాయిదా వేశారు.