- వినతి పత్రంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాం తి): జనాభా సేకరణకు వినియోగించే ఫారా ల్లో కులం, మతం వెల్లడించని వారి వివరాల నమోదుకు (నోక్యాస్ట్, నో రిలిజియన్) ఎన్సీ, ఎన్‌ఆర్ కాలమ్స్ పెట్టాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని పరిశీలించి, చట్టప్రకారం నిర్ణయం తీసు కోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబ రు 4కు వాయిదా వేసింది.
ఈ నెల 6 నుంచి జరిగే సమగ్ర కుటుంబ సర్వేలో కులం, మతం వద్దనకునేవారి వివరాల సేకరణకు ప్రత్యేక కాలమ్స్ పెట్టాలంటూ ఇచ్చిన వినతి పత్రాలను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ మహమ్మద్ వహీద్, కుల నిర్మూలన సంఘం ప్రధాన కార్యదర్శి డీఎల్ కృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నంద మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్‌కుమార్ వాదనలు వినిపిస్తూ కులం, మతం వివరాలను వెల్లడించనివారి వివరాల సేకరణకు ప్రత్యేక కాలమ్ పెట్టాలంటూ గత నెల 29, ఈ నెల 1న వినతి పత్రాలు సమర్పించామన్నారు.
ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ అంశంపై ఇటీవల ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టిందన్నారు. జనాభా గణాంక కమిషన్ కులం, మతం తప్పనిసరిగా వెల్లడించాల్సిన అవసరంలేదని చెప్పడ ంతోపాటు కులం, మతం వద్దనకునేవారి వివరాలు స్పష్టంగా లేనందున ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొందని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో కులం, మతం వద్దనుకునేవారి వివరాలను ప్రత్యేకంగా మాన్యువల్గా సేకరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
వాదనలను విన్న న్యాయమూర్తి వినతి పత్రాన్ని పరిశీలించాలని ఆదేశించారు. రాజ్యాంగంలోని అధికరణ 25(1) ప్రకారం నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. విజ్ఞప్తిపై ఏం నిర్ణయం తీసుకున్నారో పిటిషనర్‌కు సమాచారం అందించాలని స్పష్టంచేశారు. కులం, మతం వెల్లడించని వారి వివరాలను ప్రత్యేకంగా సేకరించడానికి ఉన్న ఇబ్బందులేమిటో తెలియజేయాలంటూ సాధారణ పరిపాలన శాఖ, సామాజిక సంక్షేమశాఖ, వెనుకబడినవర్గాల సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శులు, బీసీ కమిషన్లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను డిసెంబరు 4కు వాయిదా వేశారు.