శ్రీరామోజు హరగోపాల్ :
నేడు సుద్దాల హనుమంతు వర్ధంతి :
ఒక్క ‘పల్లెటూరి పిల్లగాడా’ పాటతోని తెలంగాణే కాదు, తెలుగువా రందరి నోటి పాటైన వాడు సుద్దాల హనుమంతు. జానపద, నాగరిక కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన హనుమంతు ఎంతో గొప్పగా పాటలు పాడేవాడు. తన తండ్రితో అయిదుగురు సోదరులు ముప్పయేండ్లపాటు వీధి నాటకాలు ప్రదర్శించిన వాళ్ళే.
తానుకూడా యక్షగానాలు, పద్యనాటకాలు వేసిన రంగస్థల కళాకారుడే. తాత నుంచి వారసత్వంగా వచ్చిన ఆడి, పాడి అలరించే హరికథ తెలిసిన వాడే. తను పుట్టి పెరి గిన పాలడుగు గ్రామానికి వచ్చిన హరికథ కళాకారుడు, ఆధ్యాత్మిక వేత్త అయిన అంజన్‌దాసు శిష్యుడైనాడు.
రంగస్థల కళేకాదు, ఆధ్యాత్మిక విద్యనూ గురుముఖాన నేర్చుకున్నాడు సుద్దాల. గురువు డ్రామా కంపెనీ సభ్యుడిగా రెండేండ్లు ఎన్నో గ్రామాలలో ప్రదర్శనలిచ్చిండు. అద్భుతమైన గాత్రం, సా టి లేని నటనా వైదుష్యం అబ్బినయి. అంతేకాదు, స్వయంగా పాటలూ రాసేవాడు.
జీవిత పాఠశాలలో ఓనమాలు
సుద్దాల హనుమంతు తల్లిదండ్రులు లక్ష్మీనర్సమ్మ, బుచ్చిరాములు. 70 ఊర్లు తిరిగి ఆయుర్వేద వైద్యం చేసేవాడు బుచ్చిరాములు. హనుమంతు తోడబుట్టిన వారు ఒక అన్న, ఇద్దరు అక్కలు. చిన్నపుడు తన చదువు కానిగిబడిలో సాగింది. అక్కడ పంతులు వేసే శిక్షలకు భయపడి చదువే వద్దనుకున్నడు. గుర్రం స్వారీ, ఈతలంటే ఇష్టం. ఆ రోజుల్లో దొరల దౌర్జన్యాలకు అంతులేకుండేది.
పల్లికాయ దొంగతనానికి కూడా పిల్లల ప్రాణం దీసేటోల్లు. నిజాం ప్రభుత్వం మీద, దొరల మీద తనకు కసి, కోపం కలిగేవి. వాళ్ళ గ్రామానికి టీచరుగా వచ్చిన లక్ష్మీనారాయణ సార్ గురించి గొప్పగా విని మళ్ళీ చదువుకోవడానికి బడికి పోయిండు సుద్దాల హను మంతు. రెండో తరగతి సగం వరకు చదివే లోపల్నే లక్ష్మీనారాయణ సార్‌కు తబాదిలైంది. మరో సార్ వచ్చిండు. పాత శిక్షలు చూసి మొత్తానికే బడి మానిండు.
ఆ తర్వాత పాలడుగులో హరికథ చెప్పడానికి వచ్చిన ఆత్మకూరు అంజయ్య డ్రామా కంపెనీలో చేరిండు. తన చదువు నాటకాలతోనే సాగిపోయింది. ఊరిలో దొరతనాల హుకుంలు చూసి రగిలిపోతుండే వాడు. ఊరిలో ఉండలేక, హైద్రాబాద్ చేరి వ్యవసాయ శాఖలో గుమస్తాగ చేరిండు.
నిజాం మీద తిరుగుబాటు చేస్తున్న సంస్థగా భావించి తాను ‘ఆర్య సమాజం’లో కార్యకర్తగ వున్నడు. ఈ సంగ తి తెలిసిన ఆఫీసర్ తనను దూషించడంతో, ఉద్యోగానికి రాజీనామా చేసిండు. బతుకు తెరువు కోసం దర్జీ పని నేర్చుకున్నడు.
కథ మారినా, కన్నీళ్లు పోలేదు
1944లో భువనగిరిలో జరిగిన 11వ ‘ఆంధ్ర మహాసభ’లో రావి నారాయణరెడ్డి ఉపన్యాసం విన్న హనుమంతు కమ్యూనిస్టయ్యిండు. ఈ సమయంలో తాను వర్ణాంత ర వివాహం చేసుకున్నడు. తాను కమ్యూనిస్టుగా మారడం, తన తీవ్రతలూ ఆమెకు నచ్చలేదు. తను వెళ్ళిపోయింది. దానితో తన ఆదర్శ వివాహం విఫలమైందని చెప్పుకున్నడు సుద్దాల.
సుద్దాల గ్రామం చేరి, అక్కడే స్థిరపడి పోవడంతో తన ఇంటిపేరు గుర్రం బదులు సుద్దాలగా మారింది. అపు డే జానకమ్మను పెండ్లి చేసుకున్నడు. ఆమె హనుమంతుతో సమవుజ్జీగా కమ్యూనిస్టు ఉద్యమాలన్నింటిలో పాల్గొన్నది. సుద్దాల హన్మంతు తెలంగాణ సాయుధపోరాటంలో సాంస్కృతిక ఉద్యమాన్ని బాధ్యతగా స్వీకరించిండు.
కాలక్రమంలో ఉద్యమం నిలిచి పోయింది. అమరవీరుల త్యాగాలు వృధా అయిపోయినై. ఆశించిన ప్రజారాజ్యం రాలేదు. విముక్తి చేసిన ప్రాంతాలన్నీ మళ్ళీ పాత అధికారాల కిందికే పోయినై. నిజాం పాలన మాత్రం పోయింది.
బంగారానికి తావి అబ్బినట్లు..
తాను తండ్రి లెక్కనె వైద్యం చేసిండు. ఆర్.ఎం.పి. పరీక్ష పాసైండు. సీపీఐ పార్టీ కార్యకర్తగా సుద్దాలలో గ్రామ కమిటీ కార్యదర్శిగా పని చేసిండు. పాటలు రాసిండు. 1982 అక్టోబర్ 10వ తేదీన 74 ఏండ్ల వయసులో తనువు చాలించిండు హనుమంతు. హైద్రాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నపుడు సుద్దాల హనుమంతు ఆధ్యాత్మిక భావజాలంతో ‘యథార్థ భజనమాల’ అనే భజన కీర్తనల పుస్తకం రాసిండు.
బంగారానికి తావి అబ్బినట్లు పాట లు పాడే సుద్దాల హనుమంతుకు పాటలు రాయడమూ వచ్చింది. ఆర్ద్రంగా గీతాలు పాడేవాడు. మనిషి మనసు కూడా ఆర్ద్రమే. సుకుమారమైన భావాలకు కరిగి పోయేటోడు. హృదయోద్వేగం ఆపుకోలేక జల జలా కన్నీరు కార్చేటోడు. కరుణాకాతరుడు సుద్దాల హనుమంతు. ఆ కరుణాతత్వమే, ఆ ప్రేమగుణమే హనుమంతు పాటల్లో వుంది.
తాను ప్రేమించే తన సాటి మనుషులపై దౌర్జన్యాలను చూసి, తట్టుకోలేకనే ఆనాటి తెలంగాణా సాయుధ పోరాటంలో కార్యకర్తగా చేరిన హనుమంతు సాయుధ దళంలో తుపాకీ ధరించి తిరిగిండు. ఉద్యమంలో సాంస్కృతిక సేనానిగా ఎన్నో కళా ప్రదర్శనలు ఇచ్చిండు. ప్రదర్శనల కోసం స్వయంగా తాను రచించిన కళా రూపాలెన్నో వున్నయి. బుర్రకథ, గొల్ల సుద్దులు, పిట్టలదొర, సాధు వేషం, అల్లాకే నాం వంటి వెన్నో తన రచనలు అశేష ప్రజాదరణ పొందాయి.
గుండెల్ని తడిపే కరుణరసం
సుద్దాల హనుమంతు పాటలు కవితాత్మకంగా వుంటయి. అద్భుతమైన ఊహతో పాట రాయడంలో మొనగాడు సుద్దాల. ‘పల్లెటూరి పిల్లగాడా/ పసులగాచే మొనగాడా/ పాలు మరిచి/ ఎన్నాళ్ళయిందో/ ఓ పాల బుగ్గల జీతగాడా/ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో...’ పాటలో హనుమంతు వాయించే హార్మోనియంలో నిర్భర శ్రుతి వుంది. రాగ, లయలున్నాయి.
1946 ప్రాంతంలో ప్రతి రోజు సుద్దాల నుంచి తాను తేరాలకు పోయి, వచ్చే దారిలో గుండుమీద కూసుని ఏడుస్తు కనిపించిన బత్తుల అబ్బయ్య అనే పసుల కాడి పోరని నిజమైన, దుఃఖభరిత జీవితాన్నే పాటగా విశ్వజనీనం చేసిండు సుద్దాల కవి. ఈ పాట తర్వాత అంతే దయార్ద్రమైన పాట ‘వెట్టి చాకిరి విధానమో రైతన్న/ ఎంత చెప్పిన తీరదో కూలన్న’. ఈ పాటలో నాటి దొరలు గ్రామ ప్రజలు, వృత్తి కులాల వారితో చేయించుకునే వెట్టిచాకిరి దుస్థితిని కండ్లకు కట్టిండు హనుమంతు.
తన చిన్ననాడు జ్వరంతో నడువ లేకున్న బరువొంతుల వీరయ్య తన వంతు బరువులు మోసే పని చేయలేనని అన్నందుకు వచ్చిన అధికారి బూట్లతో తన్ని కొరడా కొట్టి హింసించడం చూసిన హనుమంతు మనసులోని బాధే ఈ పాటైంది. నిజ జీవితంలోని సంఘటనలను పాటలుగా రాసుకున్నడు సుద్దాల.
దొరలకు తలక్షౌరం, మొలక్షౌరం ఎంత జులుం? దొరల కచ్చురాల ముందర పసురాలకంటె ముందు ఉరుకుడు ఏం గోస? ఇవన్నీ ఆ దొరతనాల అమానుష, పెత్తందారీతనాల సంస్కృతి. ఈ దుర్మార్గాలను తన పాటలో రికార్డు చేసిండు హనుమంతు. ఈ పాట విన్నవారి గుండె తడిసి పోతుంది. కరుణాగ్ని రగులుతుంది. అదే పోరాటానికి ప్రేరణ అయ్యింది.
ప్రజా జీవన చిత్రాలే ఆయుధాలుగా..
తెలంగాణ సాయుధ పోరాటం ఒక స్వాతంత్య్ర సమరం. నిజాం నిరంకుశ రాజ్యం నుంచి విముక్తిని కోరి చేసిన ప్రజాయుద్ధం. అందుకే, కవి సుద్దాల ఆ పోరులో నిలువడం అంటే స్వాతంత్య్ర రథం ఎక్కడమని భావించిండు. ఆ పోరాటంలో సమర వీధుల్లో వీరు లు రథమెక్కి రణరంగంలో అతివాద శరములు కురిపించిండ్రట.
యుద్ధంలో ప్రాణాలపై ఆశ కల్ల. నాటి సాయుధ పోరాటవీరులు చేసిన పోరును హనుమంతు గొప్పపాటగా మలిచిండు. పాడితే ఉద్రేకం, చదువుకుంటే ఉద్వేగం కలుగుతయి. తన కవిత్వంలో రాగ, తాళ, భావాలు ఎక్కడా జారిపోవు. వాడిన మాటలు, ఎన్నుకున్న సందర్భాలను ఉద్దీపింపజేసేవే. కాన్షియస్‌గా రాసిండు హనుమంతు.
సుద్దాల హనుమంతు రాసిన వందకుపైగా వున్న పాటల్లో సేకరణకు అందినవి కొన్నే. అందులో వివిధ కళారూపాల రచనలు. తన రచనలను సేకరించిన సమగ్ర సం పుటం సుద్దాల అశోక్ తేజ సంకలించిన ‘పల్లెటూరి పిల్లగాడా’ అనే పుస్తకం. దీనిలో సుద్దాల హనుమంతు రాసిన పాటలు, భజ న కీర్తనలు, గొల్ల సుద్దులు, సాధువేషం, యక్షగానం వున్నాయి. ఒక్క భజన కీర్తనలలో త ప్ప మిగతావన్నీ ప్రజలకోసం కైగట్టిన పాట లే, ప్రజా జీవితం వస్తువుగా రచించినవే.
సుద్దాల హనుమంతుకు ఇష్టమైన పాటలలో ‘ఆకలి మంటలు’ ఒకటి. ‘మంటలు, మంటలు, మంటలు... దేశమంతట ఆకలి మంటలు’ అని మొదలైతుంది ఆ పాట. ‘లేరా జాగేలా’ అనే పాటలో హనుమంతు తన సదాశయాన్ని ప్రకటించిండు. ‘సకల జనులందరిలో సద్విద్యలెల్ల, సామ్యభావమున పెంపొంది శోభిల్ల, నీ ప్రతిభ నీ పురోగమనంబులెల్ల, నిఖిల ప్రపంచంబు గని సంతసిల్ల’ అంటడు.
దేశప్రజలంతా చదువుకుని, సర్వసమానత్వాన్ని సాధించి, ప్రతి ఒక్కరి ప్రతిభ ప్రపంచం సంతోషించేటట్లు ఉండాలని కోరుతున్నడు. మరొక పాట ‘ఎందుకు భయం’లో ‘ధనస్వామ్యము, భూస్వా మ్య విధానము, ధ్వంసీకృతమై పోవునులే, దోపిడి, దొరతనముండదులె, దొంగల అంగ డి సాగదులే’ అని ఆశంసిస్తడు కవి సుద్దాల.
‘వాక్యం రసాత్మకం కావ్యం’
సుద్దాల హనుమంతు ‘వీర తెలంగాణ’ అనే యక్షగానం రాయడం మొదలు పెట్టిం డు. కాని, అనారోగ్యం వల్ల పూర్తి చెయ్యలేక పోయిండు. హనుమంతు కుమారుడు సుద్దాల అశోక తేజ, తన తండ్రి శైలిలో 54 సన్నివేశాలు చేర్చి ఆ యక్షగానాన్ని పూర్తి చేసిండు. తానెన్నుకున్న రచనా ప్రక్రియ ఏదై నా దానికి సముచితమైన రచనా విధానాన్ని ఎన్నుకుని రాసిండు.
యక్షగానాలలో తనకున్న నటనానుభవం ఈ రచనకు తోడ్పడిం ది. పాత్ర ప్రవేశపెట్టిన తీరు, దానిని చిత్రించిన వైనం, పదాల కూర్పు, అర్థ సాధన సాధారణమనిపించే అసాధారణ రచన. తన రచనలలోని పాత్రలు, స్వభావాలు, ఆహార్యాలు అన్నీ ప్రజలనుంచి గ్రహించినవే. ఎక్క డా కృతకత్వం ఉండదు. స్వభావోక్తులతో రచిస్తడు.
రూపకాలంకారాలతో పాత్రలను అలంకరిస్తడు. కవిత్వమంటే శుద్ధ వచనకవితే కాదు. ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న సూత్రమే గీటురాయి. అది ఎన్ని రూపాలలో వున్న కవి ప్రతిభ, ఊహా వైభవానికి కట్టిన అక్షరాల మిద్దె. సుద్దాల హనుమంతును ‘లొల్లాయి పాటల’ రచయితగా అనుకుంటే పొర పాటు. ఒక దార్శనికతతో జీవితానుభవసారాన్ని అక్షరాలలో పండించిన కవి సుద్దాల.
హనుమంతు జీవితంలో పెద్దవంతు తెలంగాణ సాయుధ పోరాటంతోనే గడిచింది. ఈ కాలంలో పోరాట వీరులకు స్ఫూర్తినిచ్చిన పాటల నదిగా వారి మధ్య ప్రవహించిండు. ‘బాంచెన్ నీ కాల్మొక్త’ అన్న బడుగుప్రజలతో బడితెలు, తుపాకులు పట్టించి పోరుబాట నడిపించిన గీతాలల్లిన పాటల నేత ఆయన.
పెన్నూ, గన్నూ ధరించిన ప్రజోద్యమ గీతకారుడు, సమసమాజాన్ని స్వప్నిస్తూ, జీవితాంతం పోరాట స్ఫూర్తిని వదలని అగ్నిధార హనుమంతు. ఆయన పాటల్లో ప్రజా జీవితం ప్రతిబింబిస్తుంది. కొత్త ప్రపంచం దార్శనికత వినిపిస్తుంది. ప్రజల భాషలో, ప్రజల శైలిలో, ప్రజల రాగ లయల్లో సుద్దాల హనుమంతు చిరస్థాయిగా నిలిచిపోయిండు.