మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన...
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): స్నేహితుడి భార్యను కత్తితో బెదిరించి అతని ఇంట్లో చోరీకి పాల్పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగి మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. బీటెక్ పూర్తి చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న హరీష్ కృష్ణ (35) జల్సాలకు అలవాటు పడి తాను పనిచేసే కంపెనీలో సహోద్యోగి అయినా మణికంఠ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడేందుకు ప్రణాళిక రచించాడు. వాట్సాప్ గ్రూపులో మణికంఠ కదలికలపై నిఘా పెట్టాడు. అతను క్రికెట్ ఆడటానికి గ్రౌండ్ కి వెళ్లాడని వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలుసుకున్న హరీష్ కృష్ణ ముఖానికి ముసుగు, హెల్మెట్ ధరించి అతని ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న మణికంఠ భార్యను కత్తితో బెదిరించి బంగారు గాజులు దోచుకువెళ్లాడు. మణికంఠ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 20 గ్రాముల బంగారు గాజులు, ఒక కత్తి, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. హరీష్ కృష్ణకు పెళ్లి అయి భార్యతో గొడవల కారణంగా విడిగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.