- భారత్‌లో పేదరికం నుంచి 80 కోట్లమందికి విముక్తి
- ఐదారేళ్లలోనే సాధించిన స్మార్ట్‌ఫోన్ విప్లవం
- ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ ప్రెసిడెంట్ ప్రకటన
యునైటెడ్ నేషన్స్, ఆగస్టు 2: భారత్‌లో టెలికం విప్లవం 80 కోట్లమందిని పేదరికం నుంచి బయటపడేసిందని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. అది కూడా ఐదారేండ్లలోనే సాధ్యంచేసి చూపించారని కొనియాడారు. ఇదంతా స్మార్ట్‌ఫోన్ వాడకం వల్లనే సాధ్యమైందని చెప్పారు. ‘ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఆకలి రహిత సమాజాన్ని అందించేందుకు సాధించవల్సిన ప్రగతి’ అనే అంశంపై ఐరాసలోని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) నిర్వహించిన కార్యక్రమంలో ఫ్రాన్సిస్ ఈ ప్రకటన చేశారు.
‘ఒక దేశం వేగంగా అభివృద్ధి చెందేందుకు డిజిటలైజేషన్ పునాదులు వేస్తుంది. ఇందుకు భారతదేశమే ఉదాహరణ. స్మార్ట్‌ఫోన్ల వాడకం వల్ల భారత్ గత ఐదారేండ్లలోనే 80 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసింది. గతంలో బ్యాంకులతో కనీస సంబంధాలు లేని గ్రామీణ ప్రాంత భారతీయ రైతులు ఇప్పుడు తమ స్మార్ట్‌ఫోన్లతోనే అన్ని వ్యాపారాలు చేస్తున్నారు. బిల్లుల చెల్లింపు, డబ్బు స్వీకరణ మొత్తం స్మార్ట్‌ఫోన్‌తోనే నడుస్తున్నది’ అని తెలిపారు.
భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విప్లవం
భారత్‌లో 15 ఏండ్ల క్రితం ఒక్క ల్యాండ్ ఫోన్ కూడా లేని గ్రామాల్లో సైతం నేడు ఇంటికి రెండుమూడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. టెలికం విప్లవంతో బ్యాంకింగ్ డిజిటలైజేషన్ విప్లవం కూడా ఒక్క పెట్టున వచ్చింది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే, భారత్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ లేకుండా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకే రావటం లేదు. మొబైల్ నెట్‌వర్క్ ఉన్న ఏ మారుమూల గ్రామంలోకి వెళ్లినా ఈ యాప్స్‌కు సంబంధించిన స్కానర్లు దర్శనమిస్తాయి. ఇలా డిజటలైజేషన్ దేశవ్యాప్తం కావటంతో చిన్నచితక బడ్డీ కొట్ల వద్ద కూడా గిరాకీ పెరిగింది. కూరగాయలు అమ్ముకొనేవాళ్లు సైతం నేరుగా బ్యాంకులతో లింకప్ అయ్యారు.
వారి బ్యాంకింగ్ లావాదేవీలను గుర్తించిన బ్యాంకులు చిన్నమొత్తాల్లో రుణాలు కూడా ఇస్తున్నాయి. దీంతో పేదలు కూడా బ్యాంకుల రుణాలు తేలికగా లభించే పరిస్థితి వచ్చింది. ఈ పరిణామంతో గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రజల వ్యాపార, వాణిజ్య కార్యకలపాలు పెరిగి ఆదాయాలు పెరిగాయి. ఎన్డీయే ప్రభుత్వం గత పదేండ్లలో డిజిటలైజేషన్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది. 2016లో రూ.500, రూ.1000 నోట్లను ఉన్నట్టుండి రద్దుచేయటంతో ప్రజలకు డబ్బు దొరకటం కష్టంగా మారింది. దీంతో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలను వాడటం మొదలుపెట్టారు. అలా దానికి బలవంతంగానైనా అలవాటు పడి, ఇప్పుడు అదే ఆధారంగా పనులు చేస్తున్నారు. ‘జనధన్ (బ్యాంకు ఖాతా), ఆధార్ (గుర్తింపు), మొబైల్ (యాక్టివిటీ పరికరం)’ను కలిపి జామ్ ఇనీషియేటివ్ అని పిలుస్తున్నారు. దేశ ప్రజలంతా ఈ జామ్‌లోకి మారాలని ప్రధాని మోదీ పదేపదే పిలుపునిచ్చారు.