calender_icon.png 16 November, 2024 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెమ్మదించిన సర్వే!

16-11-2024 01:56:39 AM

  1. భిన్నంగా సాగుతున్న కులగణన
  2. ప్రభావం చూపుతున్న రాజకీయ, సామాజిక అంశాలు
  3. కొన్ని చోట్ల అంచనాలకు మించి వివరాల నమోదు
  4. 19వ తేదీతో ముగియనున్న గడువు

హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కులగణన సర్వే ఒక్కోచోట ఒక్కో రకంగా జరుగుతున్నది. ఈ సర్వేపై రాజకీయ, సామాజిక అంశాలు ప్రభావం చూపుతున్నాయి. రాజకీయ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కులగణన ఆలస్యమవుతున్నటుల ఎన్యూమరేటర్లు చెబుతున్నారు.

ప్రధానంగా బీఆర్‌ఎస్ యాక్టివ్‌గా ఉన్న చోట పత్రాలను అనుకున్న స్థాయిలో పూర్తి చేయలేకపోతున్నామని వారు అంటున్నారు. కొన్ని సామాజిక వర్గాలను పత్రాలలో చేర్చలేదన్న కారణంతో ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. దీనికి తోడు కొందరు ఎన్యూమరేటర్లు తీరు వల్ల తీవ్ర జాప్యం జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు.

మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత టీచర్లు సర్వేలో పాల్గొనాలి. అయితే కొంద రు టీచర్లు మాత్రం 3.30 గంటలకు ఫీల్డ్‌లోకి వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫలితంగా రోజుకు 5 నుంచి 6 పత్రాలకు మించి నింపలేకపోతున్నారు. కొన్ని చోట్ల ఆశించిన దానికంటే ఎక్కువ ఫామ్స్ నింపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

అన్నీ అనుకూలిస్తే 25 నాటికి.. 

ఈనెల 19వ తేదీలోగా కులగణన సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం భావించినా.. పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మొదటి రెండ్రోజులు సర్వేపై అవగాహన లేక చాలామంది ప్రజలు విముఖత చూపా రు. ఎన్యూమరేటర్లు సైతం పత్రాలు నింపేందుకు ఇబ్బందిపడ్డారు. ఈ పరిణామాల వల్ల ఆ రెండు రోజులు సర్వే నత్తనడకన సాగింది. ఆ తర్వాత రాజకీయ కారణాల నేపథ్యంలో కొందరు ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అన్నీ అనుకూలిస్తే ఈనెల 25వ తేదీలోగా సర్వే పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ముందే హెచ్చరించిన విజయక్రాంతి

సర్వే పత్రాల భద్రతపై ఈనెల 12న హెచ్చిరించిన మాదిరిగానే.. శుక్రవారం ఓ ఘటన జరిగింది. మేడ్చల్ మున్సిపాలిటీలోని అత్వేల్లి సమీపంలో సర్వే పత్రాలు రోడ్డుపై పడి ఉండటం అధికారులను విస్మయానికి గురించింది. ఫామ్స్‌ను భద్రపర్చేం దుకు క్షేత్రస్థాయిలో సరైన సామగ్రి లేదని.. విజయక్రాంతి మంగళవారం సర్వే పత్రాలు భద్రమేనా? పేరుతో కథనాన్ని ప్రచురించింది. రోడ్డుపై అర కిలోమీటరు మేర సర్వే పత్రాలు పడి ఉండటంతో వాటి భద్రతపై అనుమానం వ్యక్తమవుతున్నది.

గ్రేటర్‌లో 27.74 శాతం సర్వే పూర్తి

6.94 లక్షల కుటుంబాలను సర్వేచేసిన ఎన్యూమరేటర్లు 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో భాగంగా గ్రేటర్ పరిధిలో 6,94,281 కుటుంబాల్లో సర్వే పూర్తయినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం 1,04,110 కుటుంబాలను ఎన్యూమరేటర్లు సర్వే చేశారు. ఈ మేరకు మొత్తం గ్రేటర్‌లో ఇప్పటి వరకూ 27.74 శాతం సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. సర్వేపూర్తి చేసిన ఫారాలను సంబంధిత సర్కిళ్లలో అందజేయగానే బ్లాక్‌ల వారీగా ట్రంక్ పెట్టెల్లో భద్రపర్చాలని సర్వే నోడల్ అధికారులు ఆదేశించారు.