658 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు
ముంబై, డిసెంబర్ 6: వరుస క్షీణతను చవిచూస్తున్న విదేశీ మారక నిల్వలు నవంబర్ 29తో ముగిసినవారంలో స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నవంబర్ 29తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 1.51 బిలియన్ డాలర్లు పెరిగి 658.091 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. సెప్టెంబర్ చివరినాటికి ఫారెక్స్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.
ఆ స్థాయి నుంచి వరుస 9 వారాల్లో దాదాపు 48 బిలియన్ డాలర్లు క్షీణించాయి. తాజాగా నవంబర్ 29తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 2.061 బిలియన్ డాలర్లు పెరిగి 568.852 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు.
తగ్గిన బంగారం నిల్వలు
ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు సమీక్షావారంలో 595 మిలియన్ డాలర్లు తగ్గి 66.979 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 22 మిలియన్ డాలర్లు పెరిగి 18.007 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్లు రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు కూడా 22 మిలియన్ డాలర్లు పెరిగి 4.254బిలియన్ డాలర్ల వద్దకు చేరాయి.