calender_icon.png 22 October, 2024 | 12:36 AM

చెంపదెబ్బ చిన్న తప్పుకాదు

27-08-2024 12:00:00 AM

లైఫ్ పార్ట్‌నర్‌తో బంధం బాగుండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. విడాకులు.. విభేదాలు ఏ ఒక్కరూ కోరుకోరు. కానీ ఈ రోజుల్లో భాగస్వామి వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ నటి శ్వేతా తివారీ సైతం తమ అనుభవాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మధ్యతరగతి కుటుంబంలో చిన్నప్పటి నుంచి రాజీపడటం, సర్దుకుపోవడం నేర్పిస్తారు. చెంపదెబ్బలు తప్ప మరేమీ కాదని చెబుతుంటారు. కానీ మా అమ్మ ఎప్పుడూ అలాంటి మాటలు చెప్పలేదు. కానీ నేను మొదటిసారి 27 సంవత్సరాల వయస్సులో విడిపోయినప్పుడు చాలా బాధలకు గురయ్యా.

సొసైటీలో తల్లిదండ్రులు ప్రతిరోజూ గొడవ పడటం, తండ్రి మద్యం తాగి ఇంటికి రావడం లాంటివి పిల్లలపై ప్రభావం చూపుతాయి. బంధం బలహీనమవుతుంది. పెళ్లైన కొత్తలోనే రిలేషన్ అబ్యూజ్ ను గుర్తించాలి. శారీరకంగా హింసించడం, లైంగిక వేధింపులకు గురిచేయడం, ఆర్థిక మార్గాలను నియంత్రించడం, ఆధిపత్యం చెలాయించడం లాంటివన్నీ వైవాహిక బంధాన్ని దెబ్బతీస్తాయి. 

పార్ట్‌నర్‌తో సమస్యలు మొదలైనప్పుడు.. ఒంటరితనం, ఆందోళన, నిరాశ చుట్టుముడుతాయి. ఇవన్నీ అనేక రకాలుగా మానసికగాయం చేస్తాయి. చెంపదెబ్బ కొట్టడం, నెట్టడం, శారీరక హింస, బెదిరింపులు, డబ్బు వంటి ప్రాథమిక అవసరాలను కోల్పోవడం లాంటివి రిలేషన్ అబ్యూజ్ కింద పరిగణించాల్సి ఉంటుంది. ఇక ఈ వేధింపుల్లో లైంగిక హింస కూడా ఉంది.

మానసిక వేధింపుల మచ్చలు బయటకు కనిపించనప్పటికీ మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే చాలామంది మహిళలు ఇవన్నీ సంసారంలో భాగమని భావిస్తూ మౌనంగా ఉండిపోతున్నారు. రిలేషన్ లో ఎక్కువకాలం వేధింపులు గురైనప్పుడు.. ఆత్మగౌరవాన్ని కోల్పోయి నప్పుడు అబ్యూజ్‌కు గురైనట్టేనని భావించాలి. పెళ్లైన కొద్దిరోజులకే ఇవన్నీ బయటపడుతుంటాయి. అలాంటప్పుడు మౌనంగా, ఓపికగా ఉండొద్దు. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. జీవితకాలం వేధింపులు భరించలేరు కాబట్టి కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి.