calender_icon.png 11 January, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు శాపంగా మారిన నైపుణ్యం

13-09-2024 12:00:00 AM

యువత దేశ భవిత. పురోగతి యువతపై ఆధారపడి ఉంటుంది. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుంది. యువతే మన కలిమి, బలిమి. ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న యువతరంలో నైపుణ్యాలు కొరవడి కోటి ఆశలతో ఉపాధి వేటకు సిద్ధమవుతున్న వారు తీవ్ర భంగపాటుకు గురవుతున్నారు. ఫలితంగా నిరాశ, నిస్పృహల్లో కూరుకు పోతున్నారని ఉపాధిరహిత వృద్ధిని ఆక్షేపిస్తూ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తాజా నివేదిక వెల్లడించింది. దేశంలో యువశక్తి నిరాశ నిస్పృహల్లో కొట్టుకుపోయి నిర్వీర్యతకు గురికావడం శోచనీయం.

ఏడు దశాబ్దాల ప్రణాళికా ప్రగతిలో ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన ప్రగతిని సాధించి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ భారతదేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దేశంలో అమలైన పారిశ్రామిక, పెట్టుబడి, ఆర్థిక విధానాలు ఉపాధి రహిత అభివృద్ధిని పెంచాయి. నిరుద్యోగం పెరిగింది. దేశంలో 2000 సంవత్సరంలో యువతలో 5.7 శాతం ఉన్న నిరుద్యోగిత 2022 నాటికి 12.1 శాతానికి పెరిగింది. 83 శాతం యువత నిరుద్యోగ శ్రామిక శ్రేణిలో వుండడం శోచనీయం.

మరోవైపు దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో జనాభాలో యువత శాతం తగ్గుతుందని తాజా అంతర్జాతీయ నివేదిక తెలిపింది. చదువుకున్న యువతతో మెరుగైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో భవిష్యత్తులో శ్రామిక మార్కెట్లో డిమాండ్ పెరిగే సూచనలున్నాయి. మార్కెట్లో డిమాండ్‌కు అనుకూలంగా యువ కార్మిక బలం అందుబాటులో ఉండదని ప్రపంచ కార్మిక సమాఖ్య, ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్’ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ‘భారత ఉపాధి నివేదిక  2024’ తాజాగా వెల్లడించింది.

తెలంగాణలోనే అదే పరిస్థితి

నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా ఏర్పడిన తెలంగాణలో ప్రభుత్వం నియామకాలను నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగిత పెరిగింది. తెలంగాణలో 15 ఏళ్ల వయసులో ఉన్న చదువుకున్న యువత 77.7 శాతం ఉన్నప్పటికీ వారికి సరిపడే ఉద్యోగాలు లేవు. చాలామంది యువత ఉపాధికి దూరంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. తెలంగాణలో 15-- ఏళ్ల వయసులో 30 శాతం యువతులు, 18 శాతం యువకులు నిరుద్యోగంలో మగ్గిపోతున్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలోని యువతలో నిరుద్యోగిత రేటు 14.19 శాతం నుంచి 21.71 శాతానికి పెరిగింది. మహిళా కార్మిక బలం వాటా తక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు.

యువకుల్లో నిరుద్యోగిత రేటు 12.96 శాతం నుంచి 18.34 శాతానికి చేరితే, యువతుల్లో ఏకంగా 17.65 శాతం నుంచి 30.35 శాతానికి పెరిగినట్లుగా పై నివేదిక తెలిపింది. 2005లో పురుషుల ఉపాధి కల్పనలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ 2022 నాటికి 2వ స్థానానికి చేరింది. మహిళా ఉపాధి సూచిలో 4వ స్థానం నుండి 7వ స్థానానికి పడిపోయింది. ఉపాధి, విద్య, శిక్షణలకు దూరంగా ఉంటున్న యువత సంఖ్య పెరుగుతున్నది. ఇది 2005లో 17.9 శాతం ఉంటే ప్రస్తుతం 27.54 శాతానికి పెరిగింది. యువతలో కంప్యూటర్ నైపుణ్యాలు తక్కువగా ఉన్నాయి. చాలామందికి బేసిక్ కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉండడం లేదు.

పనిచేస్తూ చదువుకోవడం, కోర్సు పూర్తయ్యే నాటికి నూతన నైపుణ్యాలను ఒంట పట్టించుకొని ఉద్యోగ అర్హత సంపాదించడం అభివృధ్ది చెందిన దేశాలలో సహజం. భారతదేశంలో సొంత కాళ్ళమీద నిలబెట్టే నైపుణ్యాలు విద్యార్థులకు అబ్బడం లేదు. ఏటా కోటీ 20 లక్షల మంది పట్టభద్రులు తయారవుతున్నారు. ఇందులో మూడోవంతు మందికే ఉద్యోగార్హతలు ఉంటున్నాయని నివేదిక తెలిపింది. రాబోయే 30 సంవత్సరాల్లో వివిధ రంగాల వారీగా దేశ అవసరాల ప్రణాళికలు రూపొందించి, ఉపాధి అవకాశాలను మదింపు చేయాల్సి ఉంది. అందుకు తగ్గట్లు చదువు, వృత్తి విద్యలను, ఉపాధి దోహక కోర్సులను సంస్కరించాలి.

పటిష్టమైన ప్రణాళికలు కావాలి

స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటు, కృత్రిమ మేధ, రోబోటిక్స్, వర్చువల్ డేటా సైన్స్, సాంకేతిక కోర్సులకు పటిష్టమైన పునాది వేయాలి. మార్కెట్ అవసరాలకు అనుకూలంగా పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. వ్యవసాయం, సాగు అనుబంధ రంగాలను అభివృద్ధి పరచాలి. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను విస్తరించాలి. గ్రామీణ చేతివృత్తుల ఆధునీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యాసంస్థల్లో స్కిల్ డెవలప్‌మెంట్ విభాగాలను ఏర్పాటు చేయాలి.

విద్యార్థుల ఆసక్తిని గుర్తించి వారికి ఇష్టమున్న కోర్సు అభ్యసించే విధంగా పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలి. మానవ వనరుల అభివృద్ధికి దోహదపడే విద్య, వైద్య రంగాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెట్టుబడులు పెంచాలి. యువతలో ఆధునిక నైపుణ్యాలు పెంచుకొని ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి అవకాశాలను ఒడిసిపట్టే విద్యా ప్రణాళికలకు తెలంగాణ ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో ‘తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ’ బిల్లును ప్రవేశపెట్టడం హర్షించదగ్గ అంశం.

- నేదునూరి కనకయ్య