calender_icon.png 16 November, 2024 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిస్టల్‌తో భయపెట్టి భూములు లాక్కోవాలని స్కెచ్

31-08-2024 03:20:38 AM

గాజులరామారంలో కాల్పులు జరిపిన నిందితుల అరెస్ట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): గాజులరామారంలో బుధ వారం జరిగిన కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలాపూర్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చెబ్రోలు పూర్ణిమ, తన ఇద్దరు స్నేహితులు అజయ్‌చంద్ర, గౌతమ్‌లతో కలిసి గాజులరామారంలోని తన ఇంటికి బైక్‌పై వెళ్తుండగా.. ఎల్‌ఎన్ బార్ వద్దకు రాగానే పెట్రోల్ అయిపోయింది. బార్ వద్ద ఉన్న పార్కు చేసి ఉన్న బైకు నుంచి గౌతమ్ పెట్రోల్ తీస్తుండగా బార్ క్యాషియర్ అఖిలేష్ గమనించి అడ్డుకున్నాడు. ఈ విషయం పూర్ణిమ నరేష్, శివ అనే వ్యక్తులకు ఫోన్ చేసి చెప్పడంతో నరేష్ తన థార్ వాహనంలో స్నేహితులు సొహైల్, శ్యాంసన్, నరేందర్, ఉజ్వల్‌తో కలిసి వచ్చాడు.

నరేష్ ఆదేశాలతో శివ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. భయంతో అఖిలేష్‌తో సహా బార్‌లో పనిచేస్తున్న వర్కర్లు అక్కడి నుంచి పారిపోయారు. నరేష్ తన కారుతో బార్‌లో పనిచేసే మరో వ్యక్తి నిశాంత్‌ని ఢీకొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. మరుసటి రోజు అఖిలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం చెబ్రోలు పూర్ణిమ, గౌతం, అజయ్‌చంద్ర, సొహైల్, శ్యాంసన్, నరేందర్, ఉజ్వల్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో నరేష్ తన మిత్రులైనా సమీర్, బుగ్గప్ప, కరణ్, జగ్గులతో కలిసి బీహార్‌కు వెళ్లి అమిత్ అనే వ్యక్తి సహాయంలో ఒక పిస్టల్, 100 లైవ్ రౌండ్స్ కొనుగోలు చేసినట్లు తేలింది.

ఆ పిస్టల్‌తో నరేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను భయపెట్టి భూములను లాక్కోవాలనే పతకం వేసినట్లు పోలీసులు గుర్తించారు. పిస్టల్‌తో పాటు లైవ్ రౌండ్స్‌ను శివ, నరేష్ తమ్ముడు శ్రీకాంత్ సహకారంతో దాచిపెట్టినట్టు విచారణలో తేలింది. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని వారి నుంచి పిస్టల్, 37 లైవ్ రౌండ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నరేష్, సమీర్‌లను కూకట్‌పల్లిలో జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి 50 లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు డీసీపీ తెలిపారు.