ఒక స్త్రీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఆడ బ్రతుకు’. ఈ చిత్రం విడుదలై నేటికి 59 ఏళ్లు పూర్తి చేసుకుని 60వ ఏట అడుగు పెడుతోంది. 1965 నవంబర్ 12న ఈ చిత్రం విడుదలైంది. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఎస్‌ఎస్ వాసన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, దేవిక జంటగా నటించారు. కాంతారావు కీలక పాత్ర పోషించారు. హిందీ చిత్రం ‘జిందగీ’ని తెలుగులో ఆడ బ్రతుకుగా రీమేక్ చేశారు.
తల్లితో కలిసి జీవిస్తున్న సీత (దేవిక) బతుకుదెరువు కోసం గోపాలరావు (కాంతారావు) అనే వ్యక్తి నిర్వహిస్తున్న నాటక సమాజంలో చేరుతుంది. సీతను గోపాలరావు ఇష్టపడతాడు కానీ బయటకు చెప్పడు. ఆ తరువాత జమీందార్ రావు బహదూర్ రంగనాథం కుమారుడైన రాజాను ఓ సందర్భంలో సీత కలవడం వారిద్దరూ ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం వంటివి ఆసక్తిగా సాగుతాయి.
ఆ తరువాత వారి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి? తన ఆత్మాభిమానం కాపాడుకునేందుకు సీత ఏం చేసింది? వంటి అంశాలతో సినిమా రూపొందింది. భావోద్వేగాల కలయికతో సినిమా సాగుతుంది. ఒక స్త్రీ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణలను కళ్లకు కట్టినట్టుగా ఈ చిత్రంలో దర్శకుడు చూపించారు.