ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలి
న్యాయపరమైన చిక్కుల్లేకుండా విశ్రాంత న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు
నివేదిక వచ్చాకే నూతన ఉద్యోగ నోటిఫికేషన్
స్పష్టంచేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మంత్రివర్గ ఉపసంఘం, అధికారులతో సమీక్ష
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేయాలని నిర్ణయించింది. ఈ ఏకసభ్య కమిషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
వర్గీకరణ అంశం తేలాకే నూతన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు ఏకసభ్య కమిషన్ నియామకం చేస్తామని సీఎం తెలిపారు. వర్గీకరణపై నియమించే కమిషన్ 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వేపై సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులతో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఎస్సీ వర్గీకరణపై తమకు అందిన వినతులు, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో వర్గీకరణ అమలవుతున్న తీరు, హర్యానాలో తీసుకుంటున్న చర్యలపై మంత్రి వర్గ సభ్యులు సీఎంకు వివరించారు. వర్గీకరణపై 1,082 వినతులు వచ్చినట్టు మంత్రులు వెల్లడించారు.
ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవకుండా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు చేయాలని, 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఏక సభ్య కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి అందేలా చూడాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
రాష్ట్రంలో వర్గీకరణ అమలు, కులాల రీ గ్రూపింగ్‌కు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘానికి అందిన వినతులపైనా సమావేశంలో చర్చించారు. వాటన్నింటిని ఏకసభ్య కమిషన్‌కు అందజేయాలని నిర్ణయించారు. ఏకసభ్య కమిషన్ క్షేత్ర స్థాయి నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. కమిషన్‌కు ఉప కులాల వారీఆ ఎస్సీ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని సూచించారు.
60 రోజుల్లో బీసీ కులగణన తేలాలి
బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని, రెండు నెలల్లో పూర్తి చేసి డిసెంబర్ 9లోపే నివేదిక అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ సర్వే పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లొచ్చని చెప్పారు. బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వేపై బీహార్, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాలు అనుసరించిన విధానాలను అధికారులు వివ రించారు.
బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వే చేపట్టేందుకు అవసరమైన యంత్రాంగం తమ వద్ద లేనందున, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్.. సీఎంను కోరగా, రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని కేటా యిస్తున్నట్టు సీఎం తెలిపారు. బీసీ కమిషన్, రాష్ట్ర ప్రణాళిక విభాగానికి సమన్వయకర్తగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిం చాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
ఈ సమీక్షలో మంత్రులతోపాటు ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతి, సీఎం కార్యదర్శులు మాణిక్‌రాజ్, షానవాజ్ ఖాసీం, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.