ఆకాశంలో సగం.. అవనిలో సగం.. అనే మాటలను వింటూనే ఉంటాం. అంతరిక్షంలో అయినా.. అవనిపై అయినా ఆమె చేయ ని పనంటూ లేదు. ఆమె లేనిదే సృష్టిలేదు. అలాంటి ఆమె జీవితంలో చిన్న చిన్న కోరికలను కూడా నెరవేర్చుకోలేదు. వాటిలో సైక్లింగ్ నేర్చుకోవడం, స్కూటీ పై స్వచ్ఛగా తిరగడం వంటి ఇష్టాలను బహిరంగంగా వ్యక్తపరచలేదు.
ఎందుకంటే మన వ్యవస్థ ఆలోచన ధోరణి అలాంటి. ‘సైకిల్ నేర్చుకోవడం నీకు అవసరమా’ గమ్మున్న ఇంట్లో కూర్చొని చదువుకో.. లేదంటే వంటపని నేర్చుకో అంటుంటారు తల్లిదండ్రులు. ఇది ఒకవిధమైన వివక్ష. ఈ విధమైన వివక్ష చెక్ పెట్టారు అమ్మాయిలు.
బిహార్‌కు చెందిన 27 ఏళ్ల నిభా కుమారి జీవితాన్నే మార్చేసింది సైకిల్. ఎందుకంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అమ్మాయిలకు ఉచితంగా సైకిల్స్ ఇచ్చింది. ఇలా ఇవ్వడం మూలంగా సైకిల్ మీద రెండేళ్ల పాటు స్కూల్‌కు, కోచింగ్ క్లాసులకి వెళ్లి వచ్చానని చెబుతున్నది. ఒకవేళ నాకు సైకిల్ లేకపోయి ఉంటే.. హైస్కూల్ చదువు పూర్తి చేసి ఉండేదాన్ననిఅనుకోవడం లేదు.
సైకిల్ నా జీవితాన్ని మార్చేసింది నిభా చెబుతున్నారు. బెగుసరాయ్ జిల్లాకు చెందిన ఒక రైతు బిడ్డ నిభా. ప్రాథమిక విద్య కోసం ఆమెను పది కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్ల అత్తయ్య వద్దకు పంపించారు. బాలికలు పాఠశాలకు వెళ్లి రావడం ఓ పెద్ద సవాల్. అందులోనూ ప్రజా రవాణాపై భరోసా పెట్టుకోలేం. హైస్కూల్ విద్య కోసం నిభా అధ్వానంగా ఉన్న రోడ్లపై ఇంటికి తిరిగి వచ్చేది.
ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం..
“పాఠశాలకు, కోచింగ్ క్లాసులకు వెళ్లడానికి సైకిళ్లు వాడటం మొదలు పెట్టిన తర్వాత బాలికల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. పాఠశాలకు వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఉచితంగా ఇచ్చిన సైకిళ్లు చాలామంది దగ్గర ఉన్నాయి” అని బెగుసరాయ్‌కి చెందిన ఆరోగ్య కార్యకర్త భువనేశ్వరి చెప్పారు.
ఆమె చెప్పింది నిజమే. సైన్స్ డైరెక్ట్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠ శాలలకు వెళ్లే పిల్లలకి, సైక్లింగ్‌తో ఉన్న సంబంధం గురించి వివరంగా పేర్కొంది. సృష్టి అగర్వాల్, ఆదిత్ సేథ్, రాహుల్ గోయెల్ చేసిన ఈ అధ్యయనం ప్రకారం దేశంలో గ్రామీణ బాలికల్లో సైక్లింగ్ చాలా పెరిగింది.
పదేళ్లల్లో రెండింతలు
“ఇది నిశ్శబ్ద విప్లవం. ఎందుకంటే మన దేశంలో సాధారణంగా బయట తిరిగే విషయంలో లైంగిక అసమానత్వం ఉంది. సైక్లింగ్ విషయంలో ఇది ఇంకా ఎక్కువ. ఈ నేపథ్యంలో సైకిల్ తొక్కే అమ్మాయిల సంఖ్య పెరగడాన్ని మేం విప్లవంగానే చూస్తున్నాం” అని సృష్టి అగర్వాల్ అంటున్నారు.
2004 నుంచి ప్రభుత్వం బాలికల కోసం ఉచిత సైకిల్ పంపిణీ పథకాన్ని చేపట్టింది. ఇంటి పనులు చేసుకుంటూ, ఎక్కువ దూరం నడిచి వెళ్ళాల్సి రావడం వల్ల పాఠశాల మానేసిన ఆడపిల్లల సంఖ్య మగపిల్లల కంటే ఎక్కువగా ఉంది. దీంతో ఈ సైకిళ్ల పంపిణీ కేవలం భారతదేశంలోనే కాకుండా కొలంబియా, కెన్యా, మలావి, జింబాబ్వే వంటి దేశాల్లోనూ పాఠశాలల్లో బాలికల నమోదును పెంచి, వాళ్లు స్కూల్ మానేయడాన్ని ప్రభావవంతంగా తగ్గించిందని గణాంకాలు చెబుతున్నాయి.
ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబయిలోని నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌కు చెందిన ముగ్గురు పరిశోధకులు దేశవ్యాప్తంగా 5 సంవత్సరాల మధ్య వయసున్న, పాఠశాలకు వెళ్లే పిల్లల రవాణా విధానాలను ఈ సర్వేలో విశ్లేషించి, ఉచితంగా అందించే ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని పరిశీలించారు. విద్యార్థులకు సైకిళ్లు, సైక్లింగ్ రేటుపై ఈ పథకాల ప్రభావాన్ని సమీక్షించారు.
దీంతో జాతీయ స్థాయిలో పాఠశాలకు సైకిల్‌పై వెళ్లే విద్యార్థుల శాతం 2007లో 6.6 శాతం నుంచి 2017లో 11.2 శాతంకి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం పదేళ్లలో రెండింతలు పెరిగింది.