- ఇది హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది
- బెనిఫిట్ షోలపై హైకోర్టు వ్యాఖ్య
- గేమ్‌ఛేంజర్ తెల్లవారుజాము 4 గంటలకే ప్రదర్శనకు అనుమతిపై పిటిషన్
- విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): సినిమాల ప్రదర్శనలకు కూడా వేళాపాళా ఉంటాయని, అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా సినిమాల ప్రదర్శలన కోసం థియేటర్లకు అనుమతి ఇవ్వడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలా చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది.
తెల్లవారుజాము 4 గంటలకే సినీ నటుడు రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. రాత్రి పూట నిద్రపోవాలని, ఇది ఆరోగ్య కోణంలో మానవ హక్కు కిందకే వస్తుందని చెప్పింది. అర్ధరాత్రి లేచి సినిమా చూసేందుకు ప్రేక్షకుడు వెళ్తే అతని ఆరోగ్యం ఏం కావాలని ప్రశ్నించింది.
పగలు నిద్రపోయినా రాత్రి నిద్రపోతేనే మనిషికి ఆరోగ్యమని పేర్కొంది. ఇదే సమయంలో తెల్లవారుజామున, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సినిమా షోలకు 16 ఏండ్లలోపు వారికి అనుమతివ్వడం సరికాదని వ్యాఖ్యానించింది. ఒక షో తర్వాత మరో షోకి మధ్య పావుగంట మాత్రమే సమయం ఉంటే థియేటర్లోకి వెళ్లేవాళ్లు, వచ్చేవాళ్లకు సమయం ఎలా సరిపోతుందని ప్రశ్నించింది.
షోల మధ్య 15 నిమిషాల వ్యవధి ఉంటే ఎలా సరిపోతుందో అర్థం కావడం లేదంది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాక గేమ్ చేంజర్ సినిమాకు అనుమతులపై ఆరా తీసింది. అయినా, సినిమా రిలీజ్‌కు ముందు కేసులు వేయడంతో సరిపెట్టొద్దని, ఆ తర్వా త కూడా లాజికల్ ఎండ్ కోసం ఎందుకు ప్రయత్నం చేయడం లేదని పిటిషనర్లను నిలదీసింది. పుష్ప2 సినిమా సమయంలో సంధ్య ధియేటర్ వద్ద, నిన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై ఆవేదన వ్యక్తం చేసింది.
పిటిషన్ ఎందుకు.. పిల్ వేయొచ్చుగా..
వాస్తవానికి ఇది పిల్ కిందకు వస్తుందని, మీరెందుకు పిల్ వేయరని హైకోర్టు పిటిషనర్‌ను కూడా ప్రశ్నించింది. అనేకమంది అర్ధరాత్రి షోలకు కూడా వెళ్లేందుకు సుముఖంగా ఉన్నప్పుడు మీకొచ్చిన సష్టమేమిటని అడిగింది. అభ్యంతరం ఉంటే థియేటర్ల ఎదుట ధర్నాలు చేయాలని వ్యాఖ్యానించింది. ఈ రెండు పిటిషన్లు, సంధ్య ఘటనపై పిటిషన్ కలిపి శుక్రవారం విచారణ చేపడతామని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.
తొలుత లాయర్లు వాదనలు వినిపిస్తూ.. సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారం ఉదయం 8.30 గంటల నుంచి మాత్రమే సినిమాలను థియేటర్లలో ప్రదర్శించాలని చెప్పారు. జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, హైదరాబాద్‌లో పోలీస్ కమిషనర్ మాత్రమే టిక్కెట్ల ధరల పెంపునకు ఆదేశాలు ఇచ్చే అవకాశం జీవో 120 ద్వారా లభిస్తుందన్నారు.
ఆ జీవోను ఉదహరించి సినిమా షో వేళలు, కొత్త సమయాలను అనుమతులకు వీలుగా మెమో జారీ చేయడం అన్యాయమని అన్నారు. జీవోలో పెంపు అంశం మాత్రమే ఉందని, సినిమా ఏ సమయంలో ప్రదర్శన చేయాలనే అంశం లేకపోయినప్పటికీ ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా మెమో ఇచ్చిందని చెప్పారు. విచారణ శుక్రవారం కొనసాగనున్నది.
బెనిఫిట్‌షోలు ఎందుకు?
పాపులర్ నటులు నటించిన సినిమా అయితే మరో నెలరోజులపాటు చూసేందుకు జనం వస్తారని, ఒకేరోజు అనేక షోలు ఎందుకు ప్రదర్శించాలని కోర్టు ప్రశ్నించింది. పలు దేశాల్లో సా యంత్రం ఆరు గంటలకే షాపులు కూడా బంద్ అవుతాయని, ఇక్కడ వేళాపాళా లేకుండా సినిమాల ప్రదర్శనలకు అనుమతులు ఉంటున్నాయని వ్యాఖ్యానిం చింది. రాష్ట్రంలో సినిమా షోలకు ఇష్టారీతిన అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఏమి టని ప్రశ్నించింది. ప్రజల భద్రత ముఖ్యమని చెప్పింది.
దిల్ రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా తెల్లవారుజాము 4.30 గంటలకు అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రదర్శనలకు అనుమతి, సినిమా టిక్కెట్ల రేట్ల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఇచ్చిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను జస్టిస్ బీ విజయే సేన్‌రెడ్డి గురు వారం విచారణ జరిపిన సందర్భంగా పైవిధంగా స్పందించారు. రెగ్యులేషన్స్ రూల్స్ 1970, సినిమా లైసెన్సింగ్ షరతులకు విరుద్ధమని పేర్కొన్నారు.