calender_icon.png 20 January, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్కారాజ్ కు షాక్

31-08-2024 12:00:00 AM

ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కారాజ్‌కు షాక్ ఎదురైంది. అనామక ఆటగాడి చేతిలో ఓడిన అల్కారాజ్ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్‌తో పాటు పెగులా, పవోలిని మూడో రౌండ్‌కు చేరుకున్నారు.

  1. మూడో రౌండ్‌కు స్వియాటెక్, పవోలిని
  2. బోపన్న జోడీ శుభారంభం
  3. యూఎస్ ఓపెన్

న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన అల్కరాజ్‌కు ఊహించని షాక్ ఎదురైంది. శుక్రవారం పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో అల్కారాజ్ (స్పెయిన్) 1-6, 5-7, 4-6 తేడాతో 74వ ర్యాంకర్ బొటిక్ వాన్ డీ (నెదర్లాండ్స్) చేతిలో ఓటమిపాలయ్యాడు. ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు పారిస్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన అల్కరాజ్ యూఎ స్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కే పరిమితమయ్యా డు. 2 గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో అల్కరాజ్ ఒక్కటంటే ఒక్క సెట్‌ను కూడా గెలవలేకపోయాడు. బొటిక్ 22 విన్నర్లు సంధించగా.. 27 అనవసర తప్పిదాలతో అల్కరాజ్ మూల్యం చెల్లించుకున్నాడు.

మరో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్ జానిక్ సిన్నర్ (ఇటలీ) మూడో రౌండ్ లో అడుగుపెట్టాడు.  రెండో రౌండ్‌లో సిన్నర్ 6-4, 6-0, 6-2 తేడాతో మిచెల్‌సెన్ (అమెరికా)పై సునాయాస విజ యాన్ని నమోదు చేసుకున్నాడు.  మిగిలిన మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 3-3, 6-2, 7-6 (7/5) తేడాతో ఫరోజ్‌సన్ (హంగేరీ)పై, పదో సీడ్ మినౌర్ (ఆస్ట్రేలియా) ఫిన్‌లాండ్‌కు చెందిన విర్టానెన్‌పై విజయాలు సాధించారు. భారత్‌కు చెందిన రోహన్ బోపన్న యూఎస్ ఓపెన్‌లో బోణీ కొట్టాడు. బోపన్న  మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ 6-3, 7-5 తేడాతో హసీ, అరెండ్స్ (నెదర్లాండ్స్) జోడీ మీద విజయం సాధించింది. ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న బోపన్న జోడీ ఈ టోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. 

స్వియాటెక్ అలవోకగా... 

మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ మూడో రౌండ్‌లో అడుగుపెట్టింది. రెండో రౌండ్‌లో స్వియాటెక్ (పోలండ్) 6-0, 6-1 తేడాతో షిబాహరా (జపాన్)ను మట్టికరిపించింది. గంట పాటు సాగిన మ్యాచ్‌లో నాలుగు ఏస్‌లు సంధించిన స్వియాటెక్ ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ప్రత్యర్థి మాత్రం నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. అయితే 28 అనవసర తప్పిదాలతో షిబాహరా స్వియాటెక్ ముందు తలవంచక తప్పలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా టోర్నీలో అడుగుపెట్టిన మాజీ చాంపియన్ నవోమి ఒసాక పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది.

రెండో రౌండ్‌లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి ముచోవా చేతిలో 6-3, 7-6 (7/5) తేడాతో ఒసాకా (జపాన్) పరాజయం చవిచూసింది. మిగిలిన మ్యాచ్‌ల్లో  ఆరో సీడ్  జెస్సికా పెగులా (అమెరికా) 7-6 (7/4), 6-3 తేడాతో సోఫీ (అమెరికా)పై విజయం సాధించగా.. ఐదో సీడ్ జాస్మిన్ పవోలిని(ఇటలీ)కి మూడో రౌండ్‌కు వాకోవర్ లభించింది. నాలుగో సీడ్ రిబాకినా గాయంతో వైదొలగడంతో పొంచెట్‌కు వాకోవర్ లభించింది.