calender_icon.png 29 September, 2024 | 1:47 PM

సుప్రీంలో వైసీపీ నేతలకు ఎదురుదెబ్బ

28-09-2024 02:31:21 AM

ఏపీ టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బెయిల్ నిరాకరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఏపీ టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేసిన కేసులో ఉత్తర్వుల జారీకి సుప్రీం నిరాకరించింది. పిటిషనర్లు 48 గంటల్లో తమ పాస్ పోర్టులను దర్యాప్తు అధికారులకు సరెండర్ చేయాలని ఆదేశించింది.

దర్యాప్తు అధికారులు పిలిచినప్పుడు హాజరుకావాలని, కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టంచేసింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వైసీపీ నేతలు మన్యం జగదీశ్, మద్దాలి వెంకట సుబ్బారావు, చిన్నబత్తిన వినోద్ కుమార్, సనగసెట్టి హరిబాబు, బండారు ఆంజనేయులు, షేక్ అమితా అలియాస్ అమితాబ్, గెల్లిపోగు రాజు అలియాస్ ఇసుక రాజు గతంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును ఈ నెల 22న సవాల్ చేసిన పిటిషన్లను సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ గోయల్, న్యాయవాది అల్లంకి రమేశ్, ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదించారు. మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించిన ధర్మాసనం విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది.