calender_icon.png 19 January, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ

19-01-2025 12:24:14 AM

* ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ మృతుల్లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 18 (విజయక్రాంతి)/చర్ల: మావోయిస్టు పార్టీకి తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈ నెల 16న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్న మృతి చెందినట్లు శనివారం పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ ప్రకటించింది.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని ఉమర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కంకేర్ గ్రామంలో గ్రామస్థులపై ప్రభుత్వం మారణకాండ క్షిపణి దాడికి పాల్పడిందని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో ఆరోపించారు. ఈ కాల్పులో దామోదర్ (ఎస్ సీఎం), హంగీ (పీపీసీఎం), దేవే (పీపీసీఎం), జోగా (పీపీసీఎం), నరసింహరావు (పీపీసీఎం) మృతిచెందినట్లు పేర్కొన్నారు.

వీరితో పాటు మరో 13 మంది అమరులైనట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దామోదర్ ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందినవాడు. సుమారు 30 ఏళ్ల పాటు మావోయిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన మృతితో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బే తగిలిందని చెప్పవచ్చు.

ఆరు నెలల క్రితమే రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దామోదర్‌పై రూ.50 లక్షల రివార్డు ఉంది. మరణించిన వారిలో మరో తెలుగు వ్యక్తి నర్సింహారావు  కూడా ఉన్నారు. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో దంతేవాడ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కమ్లోషన్ కశ్యప్, బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ నేతృత్వంలో ఐదువేల మంది పోలీస్ సైనిక బలగాలు ఆత్యాధునిక ఆయుధాలతో దాడికి పాల్పడినట్లు లేఖలో ఆరోపించారు. సహజ వనరులను దోచుకోవడానికే ప్రభుత్వం గిరిజనులపై యుద్ధం చేస్తున్నదన్నారు. నక్సల్ నిర్మూలన ప్రచారం కింద గిరిజన సంఘాలను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.