calender_icon.png 25 September, 2024 | 8:06 AM

సిద్ధూకు ఎదురుదెబ్బ

25-09-2024 04:06:30 AM

‘ముడా’ కేసులో సీఎంపై విచారణ జరగాల్సిందే

గవర్నర్ ఆదేశాలను సమర్థించిన కర్ణాటక హైకోర్టు

దర్యాప్తును ఎదుర్కొనేందుకు వెనుకాడను

సీఎం సిద్ధరామయ్య ప్రకటన

బెంగళూరు, సెప్టెంబర్ 24: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోజురోజుకూ ముదురుతోన్న మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం కుటుంబానికి స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్ విచారణకు ఆదేశించడాన్ని హైకోర్టు సమర్థించింది.

స్వతంత్రంగా వ్యవహరించే అధికారం గవర్నర్‌కు ఉందని స్పష్టం చేసింది. విచారణకు హాజరుకావాలని ఇచ్చిన గవర్నర్ ఆదేశాలను సవాలు చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ముడా వ్యవహారంలో సీఎంను విచారించేందుకు అనుమతిచ్చింది.

సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరులో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల నిమిత్తం ముడా సేకరించింది. దీనికి పరిహారంగా ఆమెకు మైసూర్ ఖరీదైన స్థలాలు కేటాయించింది. సిద్ధరామయ్య మౌఖిక ఆదేశాలతోనే పార్వతమ్మకు ముడా ఈ విలువైన స్థలాలు కట్టబెట్టారని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ ఆరోపణలు చేశా యి.

ఈ ఆరోపణలతో ఎస్పీ ప్రదీప్‌కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు సామాజిక కార్యకర్తలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ముందు గా ఈ వ్యవహారంలో విచారణకు ఎందుకు ఆదేశించకూడదో తెలపాలని సిద్ధరామయ్యకు గవర్నర్ షోకాజ్ నోటీసులు ఇచ్చా రు.

అనంతరం విచారణకు అనుమతిని మం జూరు చేశారు. కాగా, ఈ ఆదేశాలపై సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. గవర్నర్ ఆదేశాలను సమర్థి స్తూ సీఎంపై విచారణకు అనుమతినిచ్చింది. 

రూల్స్ ఎందుకు తలవంచాయి?: హైకోర్టు

సిద్ధరామయ్య పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ నాగప్రసన్న సింగిల్ జడ్జి ధర్మాసనం.. సీఎం కుటుంబం రూ.56 కోట్ల మేర లబ్ధి పొందారన్న ఆరోపణలు వచ్చిన ముడా భూమి లావాదేవీల్లో సిద్ధరామయ్య లేరని చెప్పడం కష్టమే. రూ.3.56 లక్షల పరిహారానికి బదులు రూ.56 కోట్లు పొందిన లబ్ధిదారులు పిటిషనర్‌కు చెందినవారు కాదని నిర్ధారించడం మరింత కష్టంగా ఉంది.

సీఎం కుటుంబం విషయంలో రూల్స్ ఎందుకు తలవంచాయనే విషయంలో విచారణ జరపాలి జస్టిస్ నాగప్రసన్న వ్యాఖ్యానించారు. అయితే, గవర్నర్ ఆదేశాలు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని, ఆర్టికల్ 163 ప్రకారం మంత్రిమండలి సలహాను పాటించలేదని సీఎం పేర్కొన్నారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఈ విషయంలో ముఖ్యమంత్రి నామినేట్ చేసిన మంత్రివర్గం నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందని ఆశించడం అసాధ్యమని పేర్కొంది. పిటిషన్‌లో వివరించిన అంశాలపై నిస్సందేహంగా దర్యాప్తు చేయాల్సిందేనని, పరిహారంలో లబ్ధి పొందినవారు పిటిషనర్ కుటుంబానికి చెందినవారేనని కోర్టు స్పష్టం చేసింది.    

రాజీనామా చేయాలి: బీజేపీ

ముడా కుంభకోణంపై విచారణ స్వేచ్ఛ గా, స్వతంత్రంగా సాగాలంటే సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీ నేత రాజీవ్‌చంద్రశేఖర్ ఈ మేరకు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. అవినీతే లక్ష్యంగా మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, సిద్ధరామయ్య సీఎం అయిన తర్వాత ప్రజాధనాన్ని అనేక మార్గాల్లో దోచుకున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ నేత ఏదో ఒక భూస్కాంలో ఉన్నారని విమర్శించారు. దళితులకు సంబంధించి న భూమిని సీఎం భార్యకు కేటాయించారని, తన పదవిని దుర్వినియోగం చేశారని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. 

ఇవన్నీ ప్రతీకార రాజకీయాలు: సిద్ధరామయ్య

ఈ పరిణామాలపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ముడా కేసులో దర్యాప్తు ఎదుర్కోవడానికి తాను సిద్ధమని, వెనుకాడే ప్రసక్తి లేదని చెప్పారు. అయితే ఈ దర్యాప్తునకు చట్టప్రకారం అనుమతి ఉందో లేదో అనే అంశంపై నిపుణులను సంప్రదిస్తానని తెలిపారు. అనంతరం తన కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

కొద్ది రోజుల్లోనే నిజం బయటికి వస్తుందని, సెక్షన్ 17ఏ కింద దర్యాప్తు రద్దు అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ రాజ కీయ పోరాటంలో ప్రజలు నా వెనుక ఉన్నారు. వారి ఆశీర్వాదాలే నాకు రక్ష. ఎన్ని కుట్రలు చేసినా చివరకు గెలిచేది న్యాయమే. మోదీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా.

బీజేపీ, జేడీయూ రివెంజ్ పాలిటిక్స్‌పై నా న్యాయపోరాటం కొనసా గుతుంది. పార్టీ అధిష్ఠానం, నేతలు, కార్యకర్తలు అందరూ నాకు మద్దతుగా ఉన్నారు. నేను పేదల పక్షపాతిని. సామాజిక న్యాయం కోసం పోరాడు తున్నందుకే విపక్షాలు నాపై కుట్రకు పాల్పడుతున్నాయి అని సిద్ధరామయ్య ఆరోపించారు.