- బాసరలో ఐదేళ్లలో 100 మంది బలవన్మరణం
- నేరాలకు అడ్డాగా బాసర?
- దిద్దుబాటు చర్యలకు పోలీసుల ప్రణాళిక
నిర్మల్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయం వద్ద ఉన్న గోదావరిలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మాససిక రుగ్మతలు కారణాలేవైనా ఇక్కడికి వచ్చి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గడిన ఐదు సంవత్సరాల్లో బాసర గోదావరి నదిలో దూకి 100 మంది ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.
2020లో 15 మంది, 2021లో 19, 2021 లో 19 మంది, 2023లో 23 మంది, 2024 లో 24 మంది గోదావరిలో దూకి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవే కాకుండా రోడ్డు ప్రమాదాల్లో 5 ఏళ్లలో 20 మంది చనిపోయారు. 100 మందికి గాయాలు అయ్యా యి. 10 హత్యలు జరిగాయి. 50 చోరీలు జరిగాయి.
చోరీలకు నిలయం.. గంజాయి రవాణ
బాసరలో నిత్యం రద్దీ ఎక్కువగా ఉండటంతో చోరీలు కూడా ఎక్కువగా జరుగు తున్నాయి. రైళ్లలో ప్రయాణికుల మాదిరిగా వచ్చిన వారు పథకం ప్రకారం దొంగతనాలు చేసి, అందినంత దోచుకుపోతున్నారు. రైల్వే స్టేషన్, అమ్మవారి ఆలయం, బస్ స్టేషన్‌లు అడ్డాగా చేసుకుని రాత్రి వేళల్లో చోరీ లకు పాల్పడుతున్నారు.
చోరీలు చేసిన తర్వాత మహారాష్ట్రకు పారిపోవడానికి ఐదే నిముషాలు పట్టడం వల్ల పంటచేనుల మీదు గా పారిపోతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఏపీ ప్రాంతాల నుంచి గంజా యి, గుట్కా, నకిలీ మద్యం, కల్తీ కల్లు ఈ ప్రాంతం నుంచే తెలంగాణకు రవాణ చేస్తున్నారు.
జాలర్లు, పోలీసుల స్పందనతో
బాసర గోదావరి వద్ద జరిగిన ప్రమాదాల్లో క్షతగాత్రులను, నదిలో దూకిన వారిని రక్షించడంలో పోలీసులు, జాలర్లు కాపాడుతున్నారు. బాసర గోదావరిలో ప్రతి రోజు 2 కి.మీ.ల దూరం పడవలపై ప్రయాణించి మత్స్యకారులు చేపలు పడుతారు. ఆ సమయంలో గోదావరిలో ఎవరు దూకినా వెంటనే వారు అక్కడి చేరుకుని కాపాడుతున్నారు. పుష్కర ఘాట్‌ల వద్ద భక్తులు ప్రమాదవశాత్తు నీటలో పడితే వారిని రక్షిస్తున్నారు.
బ్రిడ్జిపై, ఘాట్‌ల వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతుంటే వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చి, పోలీసుల సాయంతో రక్షిస్తున్నారు. ఇలా నెలకు 10 మందిని కాపాడుతున్నట్టు రికార్డులు చెపుతున్నాయి. పోలీసులు రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్, ఆలయం, గోదావరి తీరం వద్ద నిఘా పెంచారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా సరిహద్దులో తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు.
ట్రిపుల్ ఐటీలో ప్రత్యేక చర్యలు
బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పటి వరకు 10 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ నివారణ చర్యలు చేపట్టింది. నిర్మల్ ఎస్పీ జానకిషర్మిల ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకుని విద్యార్థులకు మనోధైర్యం, మానసిక వికాసం కల్పిస్తున్నారు. ఐటీ ప్రాంగణంలో డీఎస్పీ స్థాయి అధికారిని నియమించి ప్రతి విద్యార్థి కదలికలపై దృష్టి సారిస్తున్నారు. విద్యార్థుల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి, సమస్యలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
సరిహద్దులో ఉండటమే ప్రధాన కారణం?
బాసర గ్రామం నిర్మల్ జిల్లా సరిహద్దులో ఉంటుంది. నిర్మల్ జిల్లా కేంద్రా నికి 70 కి.మీ.ల దూరంలో మహారాష్ట్ర కు 2 కి.మీ.ల దూరంలో, నిజామాబాద్ జిల్లా సరిహద్దుకు కి.మీ. దూరంలో ఉం టుంది. మేజర్ గ్రామ పంచాయతీ కావ డం, అందులో నాలుగు అనుబంధ గ్రామాలు ఉండటంతోపాటు బాసర ట్రిపుల్ ఐటీ, రైల్వే స్టేషన్, అమ్మవారి ఆలయం, గోదావరి నది, నదిపై రైల్వే మార్గం, రవాణ బ్రిడ్జిలు ఉండటమే ఇక్క డ నేరాలు జరగడానికి కారణం అవుతున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ మహారాష్ట్రను కలిపే ప్రధాన మార్గం ఇదే. ఇక్కడ స్థానిక ప్రజలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజ లు ఎక్కువ సంఖ్యలో బాసరకు వస్తుంటారు. ప్రతినిత్యం జన సందడి ఉండ టంతో నేరాల నియంత్రణపై పోలీసు శాఖ ఎంత దృష్టి పెట్టినా తగ్గడం లేదు.
గోదావరిపై రెండు బ్రిడ్జీలు ఉండటం, సంవత్సరం అంతా నీళ్లు ప్రవహిస్తుండటంతో తెలుగు రాష్ట్రాలతోపాటు మహా రాష్ట్రకు చెందిన సరిహద్దు గ్రామాల వారు ఆత్మహత్యలకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. ఇక్కడి వచ్చిన వారిలో అమ్మవారి దర్శనం కోసం వచ్చినవారుగా భావించడానికి ఆస్కా రం ఉంది.
తీసుకోవాల్సిన చర్యలు
గోదావరి వంతెన వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలీస్ స్టేషన్‌కు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలి. వంతెన గోడల ఎత్తు పెంచి, పోలీస్ ఔట్ పోస్టును ఏర్పాటు చేయాలి. గజ ఈతగాళ్లను నియమించి, రాత్రి సమయంలో పోలీసు నిఘా పెంచాలి. ప్రతినిత్యం తనిఖీలు చేపట్టి అనుమానం కలిగిన వ్యక్తుల ను విచారించాలి.
గోదావరిలో దూకిన వారిని, ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించేందుకు బాసరలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. బాసరలో ప్రమాదం జరిగినా, ఆత్యహత్య యత్నానికి పాల్పడిన వారిని రక్షించేందుకు 40 కిమీ దూరంలో ఉన్న నిజామాబాద్, 30 కి.మీ.ల దూరంలో ఉన్న భైంసాకు తరలించడం వల్ల సమయానికి వైద్యం అందక కొందరు చనిపోయారు.
బాసరలో పీహెచ్‌సీ మాత్రమే ఉండటంతో సరియైన వైద్యం అందడం లేదు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది సంఖ్యను పెంచాలి. ఇద్దరు ఎస్సైలను నియమించి, రక్షణ చర్యలు మరింత సమర్థవంతంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.