calender_icon.png 31 October, 2024 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాంబు బెదిరింపుల పరంపర

31-10-2024 12:00:00 AM

దేశంలో విమానాలలో బాంబు లు పెట్టామంటూ’ బెదిరింపు కాల్స్, ఇతర సోషల్ మీడియా ద్వారా అం దుతున్న సమాచారంతో విమానయాన రంగానికి, ప్రయాణికులకు తీవ్ర నష్టంతోపాటు ఆందోళన, ఉత్కంఠ కలిగిస్తోందని చెప్పక తప్పదు. తాజాగా బుధవారం కూడా హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కి కూడ మూడు విమానాల్లో బాంబు లు పెట్టినట్లు మళ్ళీ నకిలీ బాంబు సమాచార పరంపరగా అందింది.

ఫలితంగా ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలను ఐసొలేషన్ బేకి తరలించి క్షుణ్ణంగా సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీ దళాలు డాగ్‌స్క్వాడ్‌లతో తనిఖీ చేశారు. చివరికి వాటినికూడా నకిలీ బెదరింపుగా గుర్తించారు. అసలు ప్రపంచంలోనే ఏ దేశంలోనూ విమానయాన చరిత్రలో లేని విధంగా కేవలం 18 రోజుల వ్యవధిలో 515 విమానాలకు ఇలాంటి నకిలీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిని ప్రపంచ విమాన రంగ చరిత్రలో రికార్డుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఆగంతకులు తెగబడి బెదిరింపు సమాచారం పంపించి దేశంలోని విమానయాన రంగాన్ని అస్తవ్యస్తం చెయ్యటానికి బరి తెగించారంటే దేశంలో కఠిన శిక్షలు లేకపోవటమే కారణంగా కనిపిస్తున్నది.

కఠిన శిక్షలు ఉండాలి

ఎయిర్ క్రాఫ్ట్ చట్టం 1934 ప్రకారం ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపు చేసిన వారికి కేవలం అయిదేళ్ల జైలుశిక్ష, విమాన ప్రయాణ నిషేధం విధించటం మాత్రమే వున్నాయి. అదే తీవ్రంగా ఉంటే ఇలాంటి అసహ్య, అనైతిక చర్యలకు పాల్పడేందుకు భయపడే వారు. ప్రస్తుత ఈ స్వల్ప చట్టం, అందులోని లొసుగులే నేరస్తులు ఇలాం టి చర్యలకు పాల్పడడానికి ఊతమిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే, ఈ 1934 ఎయిర్ క్రాఫ్ట్ చట్టం మార్పు చేసేందుకు కేంద్రంలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఇలాంటి నకిలీ బెదిరింపులను వట్టివే కదా అని నిర్లక్ష్యం చేయ లేం. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడలేక సమాచారం గ్రౌండ్ కంట్రోల్ నుంచి సమీపంలోని విమానాశ్రయాలలో అత్యవసర ల్యాండ్ చేయవలసి వస్తుంది. తనిఖీలు ముగిసి నకిలీవని తేలాక ప్రయాణం కొనసాగాలి. ఫలితంగా రూ. వందల కోట్లలో ఇంధన నష్టం. ప్రయాణ సమయం అదనంగా పెరుగుతుంది. ఇలాంటి వాటివల్ల విమాన ప్రయాణం అంటేనే విసుగు, విరక్తి కలుగుతోందని తరచూ అత్యవసర ప్రయాణం చేసి డబ్బుకంటే కాలం విలువైందిగా భావించే పారి శ్రామిక, ఉన్నతస్థాయి వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

18 రోజుల్లో 515 నకిలీ కాల్స్

తాజా సమాచారం మేరకు సుమారు గత 18 రోజులలో 515 కంటే ఎక్కువ దేశీ య, అంతర్జాతీయ విమానాలకు బెదిరిం పు సమాచారం అందింది. అవి నకిలీలుగా తెలిటంతో కొంత ఉపశమనం కల్గించిందని చెప్పాలి. ఈ బెదిరింపులు ప్ర ధానంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ద్వారా అందినట్లు తేలింది. ఒకేరోజు (మంగళవారం) 100 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. వీటిలో ఎయిర్ ఇండియాకు దాదాపు 38 కాల్స్ వచ్చాయి. ఇండిగో (35), విస్తారా (32)లకు ఒకే రోజులో అధిక సంఖ్యలో బెదిరింపులు వచ్చినట్లు విమానయాన రంగ వర్గాలు తెలిపాయి. ఈ ప్రభావం దేశ వ్యాప్తంగా పడింది.

గతంలో ఒకరు ఎవరైనా నకిలీ కాల్ చేస్తే వెంటనే నేరస్తుడిని ఛేదించే సమర్థత వున్న మన భద్రతా దళాలు ప్రస్తుతం పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉండికూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఇది వారికి ఒక సవాల్‌గానూ నిలుస్తోంది. ఇందుకు కారణం ఇతర దేశాల్లో ఉన్నంత కఠిన చట్టాలు మన దగ్గర లేకపోవటం, దోషులుగా నిర్ణయించాల్సిన వ్యవస్థల్లో కొందరు చొచ్చుకుపోయి నేరస్తులకు వెసులుబాటు కల్పించటం వంటివి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. గత మంగళవారం నాడు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన మరునాడే మళ్ళీ బుధవారం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు రావటం ఆందోళన కలిగిస్తున్నది.

రోజు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని లెక్క చెయ్యకుండా ముందుకెళ్ళితే ఏమవుతుందోనని భయం, పైగా రెండు వందల వరకు వుండే విమాన ప్రయాణికుల ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి రావచ్చనే భయమే అత్యవసర లాండింగ్స్‌కు దారితీస్తున్నది. ఇన్ని వందల విమానాలు అత్యవసరంగా ఎక్కడో ఒకచోట దింపటంతో వందల కోట్ల రూపాయల ఇందనం వృధా అవడం విచారకరం. ఫలితంగా స్వదేశీ విమాన సంస్థలైన ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా వంటివి నష్టాలు ఎదుర్కోవలసి రావచ్చు కూడా.

ఇన్ని విమానాలకు నకిలీ బాంబు కాల్స్ రావటం వెనుక ఏదైనా విదేశీ శక్తుల ప్రమేయం వుందా? భారత విమాన రంగాన్ని దెబ్బతీసే కుట్ర ఏమైనా జరుగుతోందా? అన్న కోణంలోనూ దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చవలసి ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ చట్టం 1934 మార్చేవరకు మీనమేషాలు లెక్కించకుండా ముష్కరులను చట్టానికి అప్పగిస్తే జరిగేదేమిటో తెలుసు కనుక త్వరగా సైలెంట్ డిస్పోజ్ అవసరం అనేది ప్రజల ఆకాంక్ష! అదే సబబు.