21-03-2025 02:02:29 AM
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నల్లగొండ, మార్చి 20 (విజయక్రాంతి) : మిర్యాలగూడలో రైస్ మిల్లులు, ఇతర పరిశ్రమల కోసం ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అసెంబ్లీలో విన్నవించానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మిర్యాలగూడలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో విద్యుత్ శాఖ అధికారులు, మిల్లర్లతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైస్ మిల్లులు అధికంగా ఉండడంతో మిర్యాలగూడలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని తెలిపారు. రైస్మిల్లుల వినియోగానికి అనుగుణంగా సరఫరా చేసేందుకు ప్రత్యేక ఫీడర్, గృహ అవసరాలకు మరొకటి ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. తన మాటలను విపక్షాలు అవగాహన రాహిత్యంతో వక్రీకరించి దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో ఎక్కడా విద్యుత్ సమస్య లేదని పేర్కొన్నారు.
రైతులు, వినియోగదారులు ఎక్కడా రోడ్డెక్కలేదని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొనే తాను ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఆసియా ఖండంలోనే అత్యధికంగా మిర్యాలగూడలో రైస్ మిల్లులు ఉన్నాయని గుర్తు చేశారు. చిరు వ్యాపారులకు సాగర్ రోడ్డులోని ఫ్లైఓవర్ కింద మార్కెట్ ఏర్పాటుకు రైస్ మిల్లర్లు సహకరించాలని కోరారు.
అంతకుముందు పట్టణంలోని ఫ్లైఓవర్ కింద ఖాళీస్థలాన్ని సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎస్పీ రాజశేఖర్రాజు, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్తో కలిసి ఆయన పరిశీలించారు. బైక్స్ పార్కింగ్ పండ్లు, కూరగాయల మార్కెట్ ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.