తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల పిటిషన్లపై హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను రూపొందించి 2023 నాటి మార్గదర్శకాల ప్రకారం బదిలీలు చేపట్టాలని గురువారం హైకోర్టు తీర్పు చెప్పింది. సీనియారిటీ జాబితా లేకుండా రూపొందించిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ ఎస్‌ఎ వెంకటరమణ సహా 15 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలు గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 81కు విరుద్ధమని అన్నారు.
పిటిషనర్లు 2012 నోటిఫికేషన్ ఆధారంగా 2013, 2014 సంవత్సరాల్లో నియమితులయ్యారని, అధికారుల పాలనాపరమైన వివాదాల వల్ల కొందరు 16 నెలలు ఆలస్యంగా నియమితులయ్యారని చెప్పారు. అంతేగాకుండా సీనియారిటీ జాబితా రూపొందించేముందు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను వేరుగా చూడరాదని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. విద్యాశాఖ కింద పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ బదిలీ మార్గదర్శకాలను రూపొందించిందని తెలిపారు. ఇవి జీవో 81కి విరుద్ధం కాదని, దానికి అనుగుణంగానే ఉన్నాయని చెప్పారు.
పిటిషనర్లు అందరూ 10 ఏళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్నారని, అందరూ బదిలీకి అర్హులేనని పేర్కొన్నారు. అంతేగాకుండా ఒకేచోట పనిచేస్తుండటం వల్ల సంస్థాగత ఇబ్బందులు, సిబ్బందితో వివాదాలున్నాయని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఒకే నోటిఫికేషన్ ఆధారంగా నియమితులైనందున చేరిన తేదీలు, తెలుగు, ఆంగ్ల మాధ్యమాలతో సంబంధంలేకుండా సీనియారిటీ జాబితాను రూపొందించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం సీనియారిటీ జాబితాను రూపొందించి, బదిలీ పాయింట్లను కేటాయించి బదిలీ ప్రక్రియను చేపట్టాలని తీర్పునిచ్చారు. పిటిషన్లపై విచారణను మూసివేశారు.