calender_icon.png 16 November, 2024 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వయనాడ్‌లో కొనసాగుతున్నసెర్చ్ ఆపరేషన్

09-08-2024 02:22:57 AM

  1. 413కు చేరిన మృతుల సంఖ్య 
  2. ఇంకా తెలియని 152మంది ఆచూకీ 
  3. మూడు దశల్లో బాధితులకు పునరావాసం

వయనాడ్ (కేరళ): కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన విషాదకర ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 413కు చేరింది. ఇంకా 152మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం 10వ రోజు గురువారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్, సైన్యానికి చెందిన 1000 మందికిపైగా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు.

గత కొన్నిరోజులుగా వయనాడ్, మల్లప్పురం జిల్లాలోని చలియార్ నది వద్ద ఈ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నది నుంచి మృతదేహాలను, శరీర భాగాలను వెలికితీసి డీఎన్‌ఏ పరీక్షల ద్వారా వాటిని గుర్తిస్తున్నారు. ఆ తరువాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించి ఖననం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వందకుపైగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా 10వేల మందికి పైగా బాధితులు ఆశ్రయం పొందుతున్నారు.

మూడు దశల్లో పునరావాసం..

రా్రష్ట్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు వయనాడ్ బాధితులకు మూడు దశల్లో పునరావాసం కల్పించనున్నారు. మొదటి దశలో ప్రాణాలతో బయటపడిన వారిని తక్షణమే తాత్కాలిక ఇళ్లు, క్వార్టర్లు, ప్లాట్లు మరియు హాస్టళ్లలో ఉంచుతారు. వాటి అద్దెను ప్రభుత్వమే భరిస్తుంది. రెండో దశలో ప్రజలను వారి శాశ్వత గృహాలకు తరలించడానికి ముందు తాత్కాలిక రవాణా గృహ వ్యవస్థను అమలు చేస్తారు. ఇక చివరి దశలో పూర్తి పునరావాసంలో భాగంగా అన్ని సౌకర్యాలతో కూడిన టౌన్‌షిప్ ప్రాజెక్టును ప్రారంభించి బాధితులకు అందులో శాశ్వత ఇళ్లు కట్టించి ఇస్తారు.

10న వయనాడ్‌లో ప్రధాని పర్యటన..

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వయనాడ్‌లో పర్యటించనున్నారు. వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 417కి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. వందల సంఖ్యలో స్థానికులు గల్లంతయ్యారు. ఈ పరిస్థితుల్లో కేరళ ప్రజలకు భరోసా నిచ్చేందుకు మోదీ ఇక్కడ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రమం పొందుతున్న బాధితులను మోదీ పరామర్శించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో వయనాడ్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హైవే ప్రాంతాలను ఇప్పటికే కేంద్రం పోలీసుల బృందం తమ ఆధీనంలోకి తీసుకుంది.