- ఇంటింటా వివరాలు సేకరిస్తున్న సిబ్బంది
- ప్రారంభమైన డెడికేటెడ్ కమిషన్ విచారణ
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12 (విజయ క్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే సజావుగా సాగుతున్నది. ఎన్యూమరేటర్లు ఇంటింటా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కానీ అక్కడక్కడ అవాంఛనీయ ఘటనలు ఎదురవుతున్నాయి.
కుటుంబ సర్వేపై పూర్తిగా అవగాహన లేని కొంత మందితో ఇబ్బందులు తలెత్తుతుండటంతో వారికి వీలైనంత త్వరగా చైతన్యం పర్చాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా డెడికేటెడ్ కమిషన్, బీసీ కమిషన్ చేపట్టే బహిరంగ విచారణను వేగవంతం చేయడంపై దృష్టి సారించినట్టు సమాచారం. అయితే డెడికేటెడ్ కమిషన్ ఆధ్వర్యంలోనూ బహిరంగ విచారణ ప్రారంభమైంది.
హైదరాబాద్‌లోని కమిషన్ ప్రధాన కార్యాలయంలోనే రెండు రోజులపాటు బహిరంగ విచారణను కొనసాగించారు. దీనికి ఇప్పటికే పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన విచారణలో పలు బీసీ సంఘాలు నాయకులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు వినతులు అందజేసి, అభిప్రాయాలు తెలిపారు.
బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. రంగా రెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని ప్రజలు, పలు సంఘాలు పాల్గొంనేందుకు అవకాశం కల్పించనున్నారు.
తప్పులకు ఆస్కారం లేకుండా సర్వే
సర్వేలో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్‌లో సర్వే మానిటరింగ్ అధికారిణి, ఎంఏ యూడీ డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక కర్ణన్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఆమె మంగళవారం ఆదర్శనగర్‌లో పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కుటుంబసభ్యుల వివరాలను జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి నమోదు చేశారు.
18 నుంచి బీసీ కమిషన్ విచారణ
ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన నేపథ్యంలో బీసీ కమిషన్ రెండో విడత బహిరంగ విచారణకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 18 నుంచి బహిరంగ విచారణను ప్రారంభించనున్నది. ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు మిగిలిన జిల్లాల్లో పర్యటించడంతోపాటు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో విచారణ ప్రక్రియ చేపట్టనుంది.
శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి: మధుసూదనచారి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి పేర్కొన్నారు. మంగళవారం డేడికేటెడ్ కమిషన్ చైర్మన్ బీ వెంకటేశ్వరరావుకు సంక్షేమభవన్‌లో తమ పార్టీ బృందంతో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో బీసీలు సమానంగా వాటా పొందాలనేది బీఆర్‌ఎస్ ఆశయమని తెలిపారు. న్యాయ స్థానాల తీర్పు మేరకు రెగ్యులర్ బీసీ కమిషన్ ద్వారా కాకుండా డెడికేటెడ్ కమిషన్ ద్వారా తులన్మాతక అధ్యయనం జరిపించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, నాయకులు కిశోర్‌గౌడ్, శుభప్రద్‌పటేల్, అంజనేయులుగౌడ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.