calender_icon.png 28 October, 2024 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో కస్సుబుస్సు

30-08-2024 01:38:10 AM

  1. ఉమ్మడి ఇందూరులో కొత్త, పాతల మధ్య జగడం 
  2. ఇటీవల పార్టీలో చేరిన వారికి పెద్దపీట!
  3. పార్టీని నమ్ముకొని కష్టకాలంలో అండగా నిలిచిన వారికి మొండి చెయ్యి!

కామారెడ్డి, ఆగస్టు29 (విజయక్రాంతి): కష్టకాలంలో కాంగ్రెస్‌పార్టీకి అండగా నిలిచిన ఉమ్మడి ఇందూరు జిల్లా నేతలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తగిన గుర్తింపు అంతంత మాత్రమే అయ్యింది. సీనియర్ నాయకులకు కూడా తగిన గుర్తింపు దక్కడం లేదని మధనపడుతున్నారు. మొదటిసారి మంత్రి వర్గంలో సీనియర్ నేతలకు అవకాశం వస్తుందని భావించినా అడియాసే అయ్యింది. రెండవసారి మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నా, ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రాష్ట్ర  వ్యవసాయశాఖ  సలహాదారు పదవి దక్కడంతో జిల్లాలోని సీనియర్ నాయకుల్లో నిస్పృహ ఆవరించింది. 

ఇదేంటని, సీనియర్ నేతలు పార్టీ అధిష్ఠానం పెద్దల వద్ద తమ ఆవేదనను వ్యక్తంచేయడంతో రాష్ట్ర పార్టీ నాయకత్వంపై అధిష్ఠానం పెద్దలు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తున్నది. అందుకే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రాష్ట్ర వ్యవసాయవాఖ సలహదారు పోస్టు ప్రకటిం చినా నియామకం జరగలేదని తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లాకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పార్టీలో ఎంతో సీనియర్ కావడమే కాకుండా కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. ఆయన అజాత శత్రువు. ఆయనకు మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ సుదర్శన్‌రెడ్డికి చుక్కెదురైంది. నిజామాబాద్‌కు చెందిన బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్,  నిజామాబాద్ అర్బన్ టికెట్‌ను ఆశించిన షబ్బీర్‌ఆలీకి మంత్రి పదవులు దక్కలేదు.

అయితే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అవకాశం కల్పిస్తే ఉమ్మడి ఇందూరు కాంగ్రెస్ నేతలకు తగిన గుర్తింపు  లభించినట్లేనని సీనియర్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి షబ్బీర్‌ఆలీని రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సలహదారుగా నియమించినా, ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు చోటు కల్పించాలని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు అధిష్ఠానం పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్‌మోహన్‌రావులు మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొంది ఈసారి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం ఆరాట పడుతున్నారు. పార్టీ అధిష్ఠానం పెద్దల వద్ద తమకు అవకాశం కల్పించాలని మొర పెట్టుకున్నట్లు సమాచారం.

బాన్సువాడకు చెందిన కాసుల బాల్‌రాజ్‌ను రాష్ట్ర అగ్రో కార్పొరేషన్ చైర్మన్‌గా నియామించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన మానాల మోహన్‌రెడ్డి, ఈరవత్రి అనిల్‌కుమార్, అన్వేష్‌రెడ్డిలకు రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులను కట్టబెట్టారు. 40 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పార్టీకోసం పనిచేసిన గడుగు గంగాధర్, కేశవేణు, రత్నాకర్, కామారెడ్డి జిల్లాకు చెందిన  డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, భిక్కనూరుకు చెందిన బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, మద్ది చంద్రకాంత్‌రెడ్డిలతోపాటు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్, బోధన్ నియోజకవర్గంలో పలువురు సీనియర్ నేతలు పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారు. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని, పార్టీలో అందలం ఎక్కిస్తామని చెప్పారు. ఆచరణలో మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి తగిన ప్రాధాన్యత లభిస్తున్నదని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి నియోజకవర్గ ఇంచార్జిగా మాత్రమే అవకాశం కల్పించారు. భవిష్యత్తులో రవీందర్‌రెడ్డి సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం.

బాన్సువాడలో కాంగ్రెస్ మూడవ స్థానంలో ఉన్నదానిని రెండవ స్థానానికి తీసుకొచ్చిన రవీందర్‌రెడ్డికి పార్టీ అధిష్ఠానం తగిన గుర్తింపును  ఇవ్వాలని బాన్సువాడ  నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేతలు బహిరంగంగానే ఉమ్మడి జిల్లా  ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదార రాజానర్సింహ దృష్టికి తీసుకెళ్లారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అందలాలు వేసి, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి మొండి చెయ్యి చూపిస్తే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్‌లో పనిచేసేవారే కరువవుతారని పార్టీ సీనియర్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.